భారీగా పెరగనున్న భూములు ధరలు..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం,మార్చి16,2023: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు విజయవాడ బైపాస్ రైల్వేలైన్ మార్గాలపై దృష్టి పెడుతున్నారు.
ఈ క్రమంలో ఇంతవరకు పట్టాలెక్కని అమరావతి నూతన రైల్వే లైన్ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చారు. విజయవాడ బైపాస్ రైల్వేలైన్ కింద దీన్ని సొంతంగా చేపట్టాలని భావిస్తున్నారు.
దేశంలోనే రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడపై రద్దీ భారాన్ని తగ్గించేందుకు అనేక అంశాలపై ఉన్నతాధికారులు కొంతకాలంగా దృష్టి సారిస్తున్నారు.
అందులోభాగంగా అమరావతి రైల్వేలైన్ ప్రాజెక్టును తెరమీదకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ అంశాన్ని త్వరలోనే రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వ హయంలో నవ్యాంధ్ర నూతన రాజధానిలో రైల్వే కనెక్టివిటీ కోసం.. కేంద్రం నుంచి నూతన రైలు మార్గం ప్రతిపాదన తీసుకువచ్చింది. కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నూతన రైలు మార్గం సర్వేకు బడ్జెట్ కేటాయించగా.. సర్వే ప్రక్రియను సైతం పూర్తిచేశారు.
విజయవాడ -గుంటూరు నగరాలను అమరావతి మీదుగా అనుసంధానంగా చేసేందుకు రూ2800 కోట్ల అంచనా వ్యయంతో నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు.
2017-18 బడ్జెట్‌లో బడ్జెట్‌ను కేటాయించారు. సాధారణ ఎన్నికల అనంతరం అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని ఎలా విధ్వంసం చేసిందో.. అమరావతి నూతన రైలు ప్రాజెక్టు పట్ల కూడా అంతే చిన్నచూపు చూపింది.
రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టు కోసం అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని కాస్ట్ షేరింగ్ అడగగా.. అందుకు అంగీకరించింది. అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత భూసేకరణ భారం భరించలేమన్న సాకుతో ఈ అంశాన్ని తొక్కిపట్టింది.
అప్పట్లో అమరావతి రైల్వే లైన్ కోసం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్‌ను ప్రతిపాదించారు.
ఈ లైన్ రావడంతో తెలంగాణ బోర్డర్ లో ఉన్న ఎర్రుపాలెం మండలానికి మహర్దశ రానున్నట్లు, భూముల ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకుంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.
గత తెలుగుదేశం పార్టీ హయాంలోనే డెవలప్మెంట్ కు కాస్ట్ షేరింగ్ చేసి ఉన్నట్లయితే ఈపాటికి ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కి ఉండేదని పలువురు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 25 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్, సత్తెనపల్లి నుంచి నరసారావుపేట వరకు 25 కిలోమీటర్ల సింగిల్ లైన్, కృష్ణా నది మీదుగా 3 కిలోమీటర్లు మేర నూతన బ్రిడ్జి నిర్మాణం వంటివి పనులకు ప్రతిపాదించనున్నారు.
ఈ నాలుగు ప్రాజెక్టులకు కలిపి 2017-18 బడ్జెట్‌లో రూ2800 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో ఎర్రుపాలెం, అమరావతి,నంబూరు వరకు 28కిలోమీటర్ల సింగిల్ లైన్ చేపట్టాలన్నది విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
విజయవాడ బైపాస్ వల్ల విజయవాడ స్టేషన్ మీద రద్దీ తగ్గించవచ్చు. మరిన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టును విజయవాడ బైపాస్ ప్రాజెక్టులో అంతర్భాగంగా ముందుకు తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే ఏడీఆర్‌ఎండీ శ్రీనివాసరావు ఒకప్రకటన లో వెల్లడించారు.