365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢీల్లీ,ఆగష్టు 6,2021: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 2వ తేదీన నగదు రహిత, కాంటాక్టు రహిత డిజిటల్ చెల్లింపుల విధానం ఇ-రుపీని ప్రారంభించారు. ఇ-రుపీ వోచర్ ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) విధానంలో కీలక పాత్ర పోషిస్తుందని, దేశంలో డిజిటల్ లావాదేవీలను మరింత సమర్థవంతం చేయడంతో పాటు డిజిటల్ పాలనకు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి అన్నారు. ప్రజలను టెక్నాలజీతో అనుసంధథానం చేయడంలో భారతదేశం ఏ విధంగా పురోగమిస్తోందో తెలియచేసేందుకు ఇ-రుపీ ఒక చిహ్నంగా నిలుస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.)
ఇ-రుపీ అంటే ఏమిటి, అదెలా పని చేస్తుంది?
మౌలికంగా ఇ-రుపీ అంటే ఒక డిజిటల్ వోచర్. లబ్ధిదారునికి అది ఒక ఎస్ఎంఎస్ లేదా క్యుఆర్ కోడ్ రూపంలో అందుతుంది. ఇది ప్రీ-పెయిడ్ వోచర్ కావడం వల్ల లబ్ధిదారులైన పురుషులు/ మహిళలు దాన్ని ఆమోదించే ఏ కేంద్రానికైనా వెళ్లి నగదుగా మార్చుకోవచ్చు.
ఉదాహరణకి ప్రభుత్వం ఒక ఉద్యోగికి నిర్దేశిత ఆస్పత్రిలో చికిత్స చేయించి ఖర్చులు భరించాలని నిర్ణయించినట్టయితే భాగస్వామ్య బ్యాంకు ద్వారా నిర్దేశిత మొత్తానికి ఇ-రుపీ జారీ చేయవచ్చు. ఆ ఉద్యోగి తన ఫీచర్ ఫోన్/ స్మార్ట్ ఫోన్ పై ఎస్ఎంఎస్ లేదా క్యుఆర్ కోడ్ రూపంలో దాన్ని అందుకుంటాడు. ఆ రకంగా ఇ-రుపీ ఒక కాంటాక్ట్ రహిత ఏక కాల చెల్లింపుల విధానం. ఎలాంటి కార్డు, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరం లేకుండానే వినియోగదారులు నగదు రహిత విధానంలో అందిన ఆ చెల్లింపు మొత్తాన్ని నగదుగా మార్చుకోవచ్చు.
ఇ-రుపీని త్వరలో భారత రిజర్వు బ్యాంకు జారీ చేయనున్న డిజిటల్ కరెన్సీగా మాత్రం భావించకూడదు. ఇ-రుపీ అనేది ప్రత్యేక లక్ష్యం కోసం ఎవరైనా ఒక వ్యక్తి పేరు మీద జారీ చేసే లక్ష్య నిర్దేశిత డిజిటల్ వోచర్.
ఇ-రుపీ ఏ విధంగా వినియోగదారునికి ప్రయోజనకరం?
ఇ-రుపీ అందుకునే వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలతో పోల్చితే ఇ-రుపీ విశిష్ట లక్షణం ఇదే. అది కాంటాక్ట్ రహితంగా రెండంచెల్లో రిడెంప్షన్ (చెల్లింపు) ప్రక్రియ పూర్తి చేసే విధానం. ఇందుకోసం లబ్ధిదారుడు తన వ్యక్తిగత సమాచారం ఎవరికీ తెలియచేయాల్సిన అవసరం లేదు.
బేసిక్ ఫోన్లపై కూడా పని చేయడం ఇ-రుపీ అందించే మరో ప్రయోజనం. అంటే స్మార్ట్ ఫోన్లు లేని వారు, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.
ఇ-రుపీ స్పాన్సర్లకు కలిగే ప్రయోజనాలేమిటి?
ప్రత్యక్ష నగదు బదిలీ విధానం (డిబిటి) పటిష్ఠం చేయడంలో ఇ-రుపీ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ ప్రక్రియ మరింత పారదర్శకం చేస్తుంది. ఎలాంటి ఫిజికల్ వోచర్లు జారీ చేయాల్సిన అవసరం లేదు గనుక ఇది వ్యయాన్ని పొదుపు చేసే సాధనంగా కూడా చెప్పవచ్చు.
సర్వీస్ ప్రొవైడర్లకు చేకూరే ప్రయోజనాలేమిటి?
ఇ-రుపీ అనేది ఒక ప్రీ పెయిడ్ వోచర్ కావడం వల్ల సర్వీస్ ప్రొవైడర్లు ఏ క్షణంలో కావాలంటే సంబంధిత చెల్లింపు పూర్తయిపోతుంది.
ఇ-రుపీ అభివృద్ధి చేసింది ఎవరు?
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పిసిఐ) నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు వోచర్ ఆధారిత విధానం ఇ-రుపీని ప్రారంభించింది.
ఆర్థిక సర్వీసుల శాఖ, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ ఆరోగ్య సంస్థ సమన్వయంతో దీన్ని అభివృద్ధి చేశారు.
ఏ బ్యాంకులు ఇ-రుపీ జారీ చేస్తాయి?
ఇ-రుపీ లావాదేవీల కోసం ఎన్ పిసిఐ 11 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అవి యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
భారత్ పే, భీమ్ బరోడా మర్చంట్ పే, పైన్ ల్యాబ్స్, పిఎన్ బి మర్చంట్ పే, యోనో ఎస్ బిఐ మర్చంట్ పే యాప్ లు ఇ-రుపీని స్వీకరిస్తాయి.
మరిన్ని బ్యాంకులు, యాప్ లు త్వరలో ఇ-రుపీ విధానంలో భాగస్వాములు కావచ్చు.
ఇ-రుపీని ఇప్పుడు ఎక్కడ వినియోగించవచ్చు?
తొలిదశలో ఎన్ పిసిఐ 1600 పైగా ఆస్పత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆ ఆస్పత్రులన్నీ ఇ-రుపీని ఆమోదిస్తాయి.
రాబోయే కాలంలో ఇ-రుపీ వినియోగదారుల పరిధి మరింతగా విస్తరిస్తుందని, ఉద్యోగులకు ప్రయోజనాలు అందించేందుకు ప్రైవేటు సంస్థలు కూడా దాన్ని వినియోగించవచ్చునని, ఎంఎస్ఎంఇలు కూడా బిజినెస్ టు బిజినెస్ (బి2బి) లావాదేవీల కోసం దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నదని నిపుణులంటున్నారు.