365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 14,2023: ఫోస్టరింగ్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME II) స్కీమ్ నిబంధనలను పాటించనందుకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టపరమైన ఎంపికలను అన్వేషిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
FAME II స్కీమ్ నిబంధనలను పాటించకుండా ప్రోత్సాహకాలను క్లెయిమ్ చేసిన ఏడుగురు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుల నుంచి కేంద్రం రూ.469 కోట్లను కోరింది.
హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ EV, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ , లోహియా ఆటో నుంచి ప్రభుత్వం ప్రోత్సాహక మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
కంపెనీలకు నోటీసులు పంపామని, ఇప్పటి వరకు రివోల్ట్ మోటార్స్ మాత్రమే ఆ మొత్తాన్ని వాపసు చేసేందుకు ముందుకొచ్చిందని అధికారి తెలిపారు. దాదాపు గడువు ముగిసిందని, వచ్చే వారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించగా, న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి పథకం కింద ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది.
ఈ ఫేమ్ -టు పథకం నిబంధనల ప్రకారం, భారతదేశంలో తయారు చేసిన భాగాలను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సాహకం ఇస్తున్నారు. అయితే ఈ ఏడు సంస్థలు దిగుమతి చేసుకున్న భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
అనేక EV తయారీసంస్థలు దశలవారీ తయారీ ప్రణాళిక (PMP) నియమాలను పాటించకుండా ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి రాయితీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ పలు ఇమెయిల్స్ రావడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. దీని తర్వాత మంత్రిత్వ శాఖ గత ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ పంపిణీని ఆలస్యం చేసింది.
వాహనాల కొనుగోలుపై పొందిన కస్టమర్ల నుంచి అదనపు రాయితీని తిరిగి చెల్లించమని అడిగే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి.
గత ఏడాది సబ్సిడీలను నిలిపివేసిన తర్వాత బకాయి చెల్లింపులు, మార్కెట్ నష్టాల కారణంగా కంపెనీలు రూ. 9,000 కోట్లకు పైగా నష్టాన్ని ఎదుర్కొన్నాయని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సంఘం (SMEV) తెలిపింది.
ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో FAME-II పథకం కింద రూ.10,000 కోట్ల కార్యక్రమం ప్రకటించారు. ఇది 1 ఏప్రిల్ 2015న మొత్తం రూ. 895 కోట్లతో ప్రారంభించిన FAME పథకం విస్తరించిన సంస్కరణ.
త్రీ-వీలర్, ఫోర్-వీలర్ సెమజెంట్‌లో ప్రజా రవాణా లేదా నమోదిత వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే వాహనాలకు ప్రోత్సాహకాలు ప్రధానంగా వర్తిస్తాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో వ్యక్తిగత వాహనాలపై దృష్టి సారిస్తోంది.