365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 23,2025: దక్షిణాది రాష్ట్రాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆయుష్షు వ్యత్యాసాలపై కేరళ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణలో పురుషుల కంటే మహిళలు దాదాపు ఆరున్నర ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు ఈ పరిశోధన తేల్చింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

సగటు ఆయుష్షు.. తెలంగాణలో మహిళల సగటు ఆయుష్షు 73.73 ఏళ్లు కాగా, పురుషులది కేవలం 67.70 ఏళ్లు మాత్రమే. ప్రమాదకర వయస్సు.. 45 నుంచి 59 ఏళ్ల మధ్య జరుగుతున్న మరణాలే ఈ ఆయుష్షు వ్యత్యాసానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఆయుష్షు విషయంలో కేరళ పురుషులు 72, మహిళలు 78 ప్రథమ స్థానంలో ఉండగా, తమిళనాడు తర్వాతి స్థానంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి.

పురుషుల ఆయుష్షు తగ్గడానికి కారణాలు ఏమిటి..?

పురుషులలో ఆయుష్షు తగ్గడానికి జీవనశైలే ప్రధాన కారణమని వైద్య నిపుణుల విశ్లేసిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిడి పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల ప్రాణాపాయం పెరుగుతోంది.

దీర్ఘకాలిక వ్యాధులు: బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు పురుషులను 60 ఏళ్లు కూడా దాటనివ్వడం లేదని డాక్టర్లు చెబుతున్నాన్నారు.మహిళలతో పోలిస్తే పురుషులు తమ ఆరోగ్యం పట్ల తక్కువ శ్రద్ధ చూపుతారని అధ్యయనం చెబుతోంది.

ప్రభుత్వాలు, సమాజం కేవలం పిల్లలు, వృద్ధులపైనే కాకుండా, మధ్యవయస్సు 45-60 ఏళ్లు దాటినవారు వారి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ అధ్యయనం సూచిస్తోంది. 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు (Regular Health Checkups) చేయించుకోవడం తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి ద్వారానే ఈ ‘ఆయుష్షు అంతరాన్ని’ తగ్గించడం సాధ్యమవుతుంది.