365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 28, 2025: ప్రేమ సహజమైన మానవ అవసరమని, అయితే టీనేజ్‌లో ప్రేమ పట్ల సరైన అవగాహన ఉండాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ అన్నారు.
బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల్ స్కూల్‌లో గురువారం లయన్స్ క్లబ్ 320ఎ ఆధ్వర్యంలో జరిగిన ‘టీనేజ్ ప్రేమ – మానసిక ఆరోగ్యం’ అనే అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్.ఎం. వాణిశ్రీ నేతృత్వం వహించారు.
టీనేజ్ ప్రేమ: ఆకర్షణ, ఆందోళన..
డా. పద్మా కమలాకర్ మాట్లాడుతూ, మనిషికి పుట్టినప్పటి నుంచి ప్రేమ కావాలని కోరుకోవడం సహజమేనని తెలిపారు. అయితే, టీనేజ్ వయసులో హార్మోనల్ మార్పులు, వ్యక్తిత్వ శోధన, కొత్త అనుభవాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయన్నారు.
ఈ దశలో “నేను ఎవరు?”, “నా జీవితానికి అర్థం ఏమిటి?” వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతారని, ఈ క్రమంలో భావోద్వేగాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ప్రేమ పేరుతో వచ్చే మానసిక సమస్యలను ఆమె వివరించారు:

ఒత్తిడి,ఆందోళన: బ్రేకప్ లేదా తిరస్కరణ ఎదురైతే డిప్రెషన్‌కు దారితీయవచ్చని, ఇది చదువుపై ఫోకస్ తగ్గి భవిష్యత్తుపై నెగటివ్ ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
ఆత్మవిశ్వాసం కోల్పోవడం: “అతను/ఆమె లేకుండా నేను జీవించలేను” అనే భావనతో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందని చెప్పారు.
సమాజానికి దూరం: స్నేహితులు, కుటుంబ సభ్యులను దూరం పెట్టి, కేవలం ఒకరిపైనే దృష్టి పెట్టడం వల్ల తమను తాము మర్చిపోతారని పేర్కొన్నారు.
సరైన మార్గం, పరిష్కారాలు..
టీనేజ్ ప్రేమను పూర్తిగా తప్పు పట్టడం సరికాదని, అది సరైన మార్గంలో ఉంటే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, స్వీయ అవగాహన పెంచుతుందని ఆమె సూచించారు. ప్రేమ అనేది చదువులు, కుటుంబం, కెరీర్‌కు వ్యతిరేకం కాదని గుర్తు చేశారు.
ప్రేమ సంబంధిత సమస్యలు ఎదురైతే సైకాలజిస్ట్ లేదా నమ్మకమైన పెద్దల నుంచి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. “ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు” అని విద్యార్థులకు ఆమె స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులు, హెచ్.ఎం. కె.వాణీశ్రీ, లయన్స్ క్లబ్ సభ్యులు జయశ్రీ, జి.లక్ష్మి టీచర్లు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అడిగిన మంచి ప్రశ్నలకు డా. పద్మా కమలాకర్ పుస్తకాలను అందజేశారు. అలాగే, విద్యార్థులు తమను తాము ఎలా ప్రేమించుకోవాలో కొన్ని పద్ధతులను నేర్పించి, వాటిని ప్రాక్టీస్ చేయించారు.