365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 18,2025 : పశ్చిమ మధ్య బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల వద్ద ఒక “వెల్ మార్క్డ్ లో ప్రెజర్ ఏరియా” (Well Marked Low Pressure Area) ఏర్పడింది.

ఈ అల్పపీడన ప్రాంతం రానున్న 12 గంటల్లో మరింత బలపడి “డిప్రెషన్” (Depression) గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) సోమవారం ఉదయం వెల్లడించింది.

ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, రేపు (మంగళవారం, ఆగస్టు 19) ఉదయం సమయంలో దక్షిణ ఒడిశా,ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలను దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్,దక్షిణ ఒడిశా జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు.

అల్పపీడనం బలపడే సూచనల నేపథ్యంలో, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను పాటించాలని సూచించారు.

ఇది కూడా చదవండి…అక్టోబర్ 1తేదీ నుంచి యూపీఐ కొత్త రూల్స్..

ఈ అల్పపీడనం కారణంగా తీర ప్రాంతాల్లో గాలులు కూడా బలంగా వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల వ్యవసాయానికి, సాధారణ జనజీవనానికి అంతరాయం కలగవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.