365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,జూన్11,2022: TTD NEWS|తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీవకుళ మాత ఆలయంలో జూన్ 23వ తేదీన మహా సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి పేర్కొన్నారు. పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళమాత ఆలయాన్ని శనివారం ఉదయం ఈవో అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటే శ్వర స్వామి వారికి మాతృమూర్తి అయిన శ్రీవకుళమాత ఆలయం ప్రాచీన కాలం నుంచి పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుందన్నారు.
రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని చెప్పారు. టీటీడీ లోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం మరోమారు రాష్ట్ర మంత్రివర్యులతో కలిసి ఆలయంలో జరుగు తున్న పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు. తరువాత ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి ఈవో పలు సూచనలు చేశారు.
అనంతరం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి భవనంలో జెఈవో వీరబ్రహ్మం శ్రీవకుళమాత ఆలయ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఏపీఎస్పీడీసీఎల్ సి.ఎం.డి.హరినాథ్, స్థానిక నాయకులు ఎం.ఆర్.సి రెడ్డి, ఛీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.