365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, ఆగస్టు 31, 2025 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ అప్పీల్ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దేశాలన్నింటిపై ఏకపక్షంగా అధిక టారిఫ్‌లు విధించేందుకు అధ్యక్షుడికి చట్టపరమైన అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. తన అత్యవసర అధికారాల చట్టాన్ని (Emergency Power Law) ట్రంప్ అతిక్రమించారని కోర్టు పేర్కొంది.
అయితే, కోర్టు ప్రస్తుతం టారిఫ్‌లపై ఎలాంటి నిషేధం విధించకపోవడంతో, ఈ తీర్పుపై అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళేందుకు అవకాశం లభించింది.
ఫెడరల్ కోర్టు ఏడుగురు న్యాయమూర్తులకు నలుగురు న్యాయమూర్తుల మెజారిటీతో ఈ తీర్పునిచ్చింది. చైనా, మెక్సికో, కెనడా సహా పలు దేశాలపై ఏప్రిల్‌లో విధించిన టారిఫ్‌ల విషయంలో ఈ నిర్ణయం వెలువడింది.
కోర్టు తన తీర్పులో, అధ్యక్షుడికి అపరిమిత టారిఫ్ అధికారాలు ఇవ్వాలనే ఉద్దేశ్యం కాంగ్రెస్‌కు లేదని పేర్కొంది.
గత తీర్పును సమర్థించిన కోర్టు..

అమెరికా ప్రభుత్వం గతంలో మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌కు టారిఫ్‌ల అత్యవసర వినియోగానికి ఆమోదం ఉందని వాదించింది. అయితే మే నెలలో న్యూయార్క్ అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం ఈ వాదనను తోసిపుచ్చింది.
ట్రంప్ విధించిన టారిఫ్‌లు అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ఇచ్చిన అధికారాలకు మించి ఉన్నాయని ఆ కోర్టు అప్పుడే చెప్పింది.
తాజా తీర్పుతో ఫెడరల్ అప్పీల్ కోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఈ విషయంలో న్యాయమూర్తుల మధ్య ఉన్న విభేదాలు ట్రంప్‌కు సుప్రీంకోర్టులో కొన్ని అవకాశాలను మిగిల్చి ఉంచాయి.
ఒకవేళ టారిఫ్‌లు ఎత్తివేస్తే, అప్పటివరకు వసూలు చేసిన కొన్ని దిగుమతులపై పన్నులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని, దాని వల్ల అమెరికా ఖజానాకు ఆర్థిక నష్టం జరుగుతుందని ట్రంప్ ప్రభుత్వం వాదించింది.
సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ట్రంప్..
ఈ తీర్పుపై స్పందించిన ట్రంప్, ఈ పోరాటాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్తానని ప్రకటించారు. కోర్టు తీర్పును అంగీకరిస్తే, అది అమెరికాను నాశనం చేస్తుందని ఆయన అన్నారు. ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల అనేక దేశాలు అమెరికాతో ఏకపక్ష వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. అలా చేయని దేశాలపై ట్రంప్ అదనపు టారిఫ్‌లు విధించారు.