Fri. Dec 13th, 2024
MALAYAPPA-swamy

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,జూన్14, 2022:తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం మంగ‌ళ‌వారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్ప స్వామివారు బంగారు కవచంలో పున‌ర్ద‌ర్శ‌న‌మిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు.

MALAYAPPA-swamy

ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు శ‌త‌క‌ల‌శ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ అనంత‌రం స్వామి, అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈఓ ర‌మేష్ బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

error: Content is protected !!