365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఎర్రుపాలెం, అక్టోబర్16,2025 : విదేశాలకు పంపిస్తానని నమ్మబలికి, అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఓ యువకుడిపై ఎర్రుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన 15 మందిని జార్జియా దేశానికి పంపిస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సత్యసాయి జిల్లా, ధర్మవరంకు చెందిన మోట్ల అభినవ్ నాయక్ మోసగించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అభినవ్ నాయక్ నారాయణపురం గ్రామానికి చెందిన వేముల నరేష్‌తో పాటు పలువురిని పరిచయం చేసుకున్నాడు.
జార్జియాకు వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి, ఒక్కొక్కరి దగ్గర రూ. 4 లక్షల చొప్పున మొత్తం సుమారు రూ. 70 లక్షలు వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్న తర్వాత వారికి వీసాలు ఇవ్వకుండా, మొహం చాటేయడం ప్రారంభించాడు.

దీంతో తాము మోసపోయామని గ్రహించిన 15 మంది బాధితులు నేరుగా ఎర్రుపాలెం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మోట్ల అభినవ్ నాయక్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ కుమార్ తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
