Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదార‌బాద్‌, మే 17, 2023: వృష‌ణాలు మెలితిరిగి, తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డుతున్న 18 ఏళ్ల యువ‌కుడికి న‌గ‌రంలోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ)కి చెందిన యూరాల‌జిస్టులు త‌క్ష‌ణ చికిత్స చేసి ఊర‌ట క‌ల్పించారు.

త‌ద్వారా అత‌డు ఓ వృష‌ణం కోల్పోకుండా చూడ‌గ‌లిగారు. వృష‌ణం మెలితిర‌గ‌డం వ‌ల్ల వ‌చ్చిన తీవ్ర‌మైన నొప్పి, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు. అస‌లు ఎందుకిలా అయ్యింద‌ని ఆరాతీస్తే.. హ‌స్త‌ప్ర‌యోగం కార‌ణంగానే ఇదంతా జ‌రిగిన‌ట్లు తేలింది.

కార‌ణం ఏదైనా.. వృష‌ణాలు మెలితిరిగిన‌ప్పుడు వీలైనంత వెంట‌నే వైద్య‌చికిత్స చేయించాలి. అవ‌స‌రాన్ని బ‌ట్టి మందుల‌తో లేదా శ‌స్త్రచికిత్స చేయ‌డం ద్వారా వృష‌ణాన్ని శాశ్వ‌తంగా కోల్పోయే ప్ర‌మాదం త‌ప్పుతుంది. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను సికింద్రాబాద్ ఏఐఎన్‌యూకు చెందిన క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ రాఘ‌వేంద్ర కుల‌క‌ర్ణి, యూరాల‌జిస్టు డాక్ట‌ర్ సూరజ్ పిన్ని తెలిపారు.

“హైదరాబాద్ న‌గ‌రానికి చెందిన ఈ యువ‌కుడికి తొలుత ఎడమ వృషణంలోను, గజ్జల్లోను నొప్పి రావడంతో ఏఐఎన్‌యూకు తీసుకొచ్చారు. వైద్య ప‌రీక్ష‌లు చేస్తే కొద్దిపాటి స‌మ‌స్య త‌ప్ప అన్నీ సాధార‌ణంగానే ఉన్నాయి.

“ఎడ‌మ వృష‌ణానికి స్క్రోటల్ డాప్లర్ స్కాన్ చేయ‌గా రంగు, ఫిల్లింగ్ పాట‌ర్న్ అన్నీ మామూలుగానే క‌నిపించాయి. కానీ, ఎడ‌మ వైపు ఎపిడైడిమిస్ మాత్రం బాగా లావుగా క‌నిపించింది.”

“మూత్ర ప‌రీక్ష కూడా సాధార‌ణంగానే ఉంది. అయితే, ఇంటెర్మినెంట్ టెస్టిక్యుల‌ర్ టోర్ష‌న్ (ఐటీటీ) ఉంటుంద‌న్న అనుమానాన్ని ఆ యువ‌కుడితో పాటు అత‌డితోపాటు వ‌చ్చిన త‌ల్లికి కూడా చెప్పాం. అందుకు శ‌స్త్రచికిత్సే ప‌రిష్కార‌మ‌ని వివ‌రించాం.”

“నాలుగు రోజుల త‌ర్వాత నొప్పి బాగా ఎక్కువ కావ‌డంతో యువ‌కుడిని మ‌ళ్లీ ఏఐఎన్‌యూకు తీసుకొచ్చారు. ఎడ‌మ‌వైపు అండ‌కోశంలో నీరు బాగా చేరిన‌ట్లు గుర్తించాం. మిగిలిన వైద్య ప‌రీక్ష‌లు కూడా చేసిన త‌ర్వాత వృష‌ణాల‌కు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే స్పెర్మాటిక్ కార్డ్ మెలితిరిగింద‌ని, దానివ‌ల్ల వృష‌ణాలు కూడా మెలిక‌ప‌డ్డాయ‌ని తెలిసింది.

దాంతో వెంట‌నే ఆ యువ‌కుడికి శ‌స్త్రచికిత్స చేయ‌డంతో నొప్పి త‌గ్గింది, వృష‌ణాన్ని కూడా కాపాడ‌గ‌లిగాం” అని డాక్ట‌ర్ రాఘ‌వేంద్ర కుల‌క‌ర్ణి తెలిపారు.

వృషణాలు మెలితిర‌గ‌డం అనేది పుట్టుకతో వచ్చే అసాధారణత వల్ల కూడా వస్తుంది. దీనివ‌ల్ల వృషణం త‌న స్పెర్మాటిక్ కార్డ్ చుట్టూ మెలితిరిగి, ర‌క్త‌స‌ర‌ఫ‌రా త‌గ్గిపోయి, చివ‌ర‌కు వృషణాన్ని శాశ్వ‌తంగా కోల్పోవాల్సి వ‌స్తుంది. ఇది ఏ వయసులోనైనా సంభవిస్తుంది. సాధారణంగా యుక్తవయసులో, కౌమారదశలో వస్తుంది.

అడపాదడపా వృషణం మెలితిర‌గ‌డం (ఐటిటి) అనేది చాలా అరుదైన అంశం, దీని నిర్ధారణకు అత్యున్న‌త నైపుణ్యం అవసరం. ఐటీటీ ప‌దే ప‌దే రావ‌డం లేదా ఎక్కువ‌సేపు ఉండ‌టం వ‌ల్ల వృష‌ణాలు బాగా మెలిక‌ప‌డ‌తాయి.

ఈ కేసుల్లో ఇమేజింగ్ ఫ‌లితాలు త‌ర‌చు త‌ప్పుదోవ ప‌ట్టిస్తాయి. చాలామంది రోగుల్లోఇది అప్ప‌టిక‌ప్పుడే త‌గ్గిపోతుంది. స్క్రోటల్ డాప్లర్ తప్పుడు నెగెటివిటీ ఎక్కువ‌గా వ‌స్తుంది, దానివ‌ల్ల శ‌స్త్రచికిత్స ఆల‌స్య‌మై, చివ‌ర‌కు వృష‌ణాన్నికోల్పోవాల్సి వ‌స్తుంది.

డాక్ట‌ర్ రాఘ‌వేంద్ర కుల‌క‌ర్ణి మాట్లాడుతూ.. “ఆ యువ‌కుడు తొలిసారి వ‌చ్చిన‌ప్పుడే ఐటీటీ కావొచ్చ‌న్న చ‌ర్చ వ‌చ్చింది. రోగి, అత‌డి త‌ల్లి కూడా మొద‌ట్లో శ‌స్త్రచికిత్స వ‌ద్ద‌న‌డంతో ముందు తాత్కాలికంగా యాంటీబ‌యాటిక్‌లు, నొప్పి నివార‌ణ మందులు ఇచ్చాం.” అని ఆయన అన్నారు.

ఐటీటీ స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు యూరాల‌జిస్టులు స్క్రోట‌ల్ ఎక్స్‌ప్లొరేష‌న్ విష‌యంలో ముంద‌డుగు వేయాలి. లేక‌పోతే వృషణాలు పాడ‌య్యే అవ‌కాశం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. యువ‌కుడు మందులు వేసుకున్నా, ఆ త‌ర్వాత మూడు నాలుగు రోజుల్లో మ‌రో రెండుసార్లు ఎడ‌మ‌వైపు వృష‌ణం తీవ్రంగా నొప్పి పుట్టింది.

దాంతో వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే వృష‌ణం చుట్టూ నీరు చేరింది. స్కాన్ చేసి చూసిన త‌ర్వాత యువ‌కుడు, అత‌డి త‌ల్లిదండ్రులు కూడా శ‌స్త్రచికిత్స‌కు అంగీక‌రించారు. చూసిన త‌ర్వాత మేం అనుకున్న‌ట్లుగానే ఎడ‌మ వృష‌ణం నీలిరంగులోకి మారిపోతోంది.

దాని చుట్టూ పెద్ద మొత్తంలో నీరు చేరింది. స్పెర్మాటిక్ కార్డ్ అప‌స‌వ్య దిశ‌లో మెలితిరిగింది. దాన్ని స‌రిచేయ‌గానే వృష‌ణం రంగు సాధార‌ణ స్థితిలోకి వ‌చ్చింది” అని వివ‌రించారు.

కొన్నిసార్లు వ్యాయామం చేసేట‌ప్పుడు, సైకిల్ తొక్కేట‌ప్పుడు కూడా వృష‌ణాలు ఇలా మెలితిరిగే ప్ర‌మాదం ఉంటుంద‌ని ఏఐఎన్‌యూ వైద్యులు తెలిపారు. ఇలా జ‌రిగిన మొద‌టి 6 గంట‌ల‌ను గోల్డెన్ పీరియ‌డ్ అంటారు. అ స‌మ‌యంలోగా స‌రైన వైద్యుల‌ను సంప్ర‌దిస్తే ఎక్కువ న‌ష్టం జ‌ర‌గ‌కుండా కోలుకునే అవ‌కాశం ఉంటుంది.

error: Content is protected !!