365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 8,2025: భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)’ను నిర్వహించనుంది.

ఈ మహత్తర ప్రాజెక్ట్‌కు సలహాలు అందించేందుకు ప్రఖ్యాత సినీ, పారిశ్రామిక రంగ ప్రముఖులతో వేవ్స్ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ సభ్యులుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మోహన్‌లాల్, రజినీకాంత్, ఆమిర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె తదితరులు నియమితులయ్యారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేవ్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడ్వైజరీ బోర్డు సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకోగా, భారత వినోద రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానితో చర్చించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ గొప్ప గౌరవాన్ని అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. వేవ్స్ అడ్వైజరీ బోర్డులో భాగమవ్వడం గర్వంగా ఉంది.

https://twitter.com/KChiruTweets/status/1888073765705367846

మోదీ మానసపుత్రికగా రూపొందిన వేవ్స్ సమ్మిట్, భారతదేశ ‘సాఫ్ట్ పవర్’ను ప్రపంచ వేదికలపై మరింత బలంగా నిలపటానికి దోహదపడుతుంది. భవిష్యత్తులో అద్భుతమైన పరిణామాలకు సాక్ష్యం కావడానికి మేమంతా ఎదురుచూస్తున్నాం” అని చిరంజీవి పేర్కొన్నారు.

ఈ సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. “వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే వేదికగా ‘వేవ్స్’ను రూపొందించాము.

ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు సభ్యులతో విస్తృత చర్చలు పూర్తయ్యాయి. గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి విలువైన సూచనలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని ప్రధాని తెలిపారు.

వేవ్స్ సమ్మిట్ భారతీయ వినోద రంగాన్ని ప్రపంచ నకశాపై మరింత ప్రతిష్టాత్మకంగా నిలపనున్నదని, కొత్త అవకాశాలను సృష్టించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.