365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,ఫిబ్రవరి 2,2023: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో గురువారం ఆయన గడ్కరీని కలిసి తమ తెలంగాణ రాష్ట్రం గుండా వెడుతున్న జాతీయ రహదారులపై నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరారు.
ఈ మేరకు ఎంపీ రవిచంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. తమ రాష్ట్రంలోని ఖమ్మం మీదుగా వెళ్లే నాగపూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్ మెంటును ఖమ్మం కలెక్టరేట్ వద్ద మార్చాలని కోరారు.
ప్రతిపాదిత హైవే మార్గం సమీకృత కలెక్టరేట్ మధ్య నుంచి వెడుతుందని, అది రాకపోకలకు అసౌకర్యంగా ఉందని, దానిని కలెక్టరేట్ వెనుక నుంచి వెళ్లేలా సవరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇదే హైవే పై ఖమ్మం, విజయవాడ మార్గం నుంచి వచ్చే వాహనాలు సూర్యాపేట సమీపాన కలిసే చోట, జాతీయ రహదారి నంబర్ 65 పై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ వద్ద కూడా వాహనదారులు,పాదాచారుల సౌకర్యార్థం అండర్ పాసులను ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి కేంద్ర మంత్రికి ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వివరించారు.
తన దృష్టికి తెచ్చిన అంశాల పట్ల మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి, వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.