
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మార్చి 28,2022: శ్రీ తాళ్లపాక అన్నమయ్య 519వ వర్ధంతిని పురస్కరించుకుని టిటిడి ఆల్ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరిగింది. టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టుల సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల.విభీషణ శర్మ మాట్లాడుతూ అన్నమయ్య తన సంకీర్తనలతో భక్తి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి సామాజిక చైత్యన్యాన్ని తీసుకువచ్చారని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరు ఉద్యోగ, కుటుంబ ధర్మాలు ఆచరించాలని, సాంఘిక ధర్మాల వల్లే సమాజంలో సుఖ శాంతులు కలుగుతాయన్నారు. అన్నమయ్య తన భక్తి సంకీర్తనలతో సామాజిక, మానసిక శాస్త్రావేత్తగా సమాజాన్ని నడిపించారని వివరించారు.

మెట్లోత్సవంలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వెయ్యి మందికిపైగా అన్నమాచార్య ప్రాజెక్టు, డిపిపి, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. మార్చి 29వ తేదీన సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం ఉంటుందన్నారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రం, తాళ్లపాక, అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద ప్రముఖ కళాకారులతో భక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఆకట్టుకున్న సంకీర్తనల గోష్టిగానం :

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనల గోష్టిగానం చేపట్టారు. ఇందులో ‘బ్రహ్మ కడిగిన పాదము…., భావములోన బాహ్యమునందును…, ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు…, పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమా…, కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు…., నారాయణతే నమోనమో…., ముద్దుగారే యశోద….” కీర్తనలున్నాయి. భక్తులు పరవశించి గోష్టిగానంలో పాలు పంచుకున్నారు.