365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 9,2022: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు నుంచి విడుదలయ్యారు. పీడీ యాక్ట్ కేసు విషయంలో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూచేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆయన్ను విడుదల చేసింది న్యాయస్థానం. ఇకనుంచి రాజాసింగ్ ఉద్దేశ్య పూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది.
పోలీసులు రాజాసింగ్ పై పీడియాక్ట్ నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన భార్య ఉషా బాయి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేశారు. కాగా రాజాసింగ్ తరపు న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు కూడా వినిపించారు. వీరి వాదనలు విన్న హైకోర్టు, ఎమ్మెల్యే రాజా సింగ్‌ను విడుదల చేయాలంటూ ఆదేశించింది.
రాజా సింగ్ విడుదలైన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించకూడదని షరతులు విధించింది కోర్టు. అంతేకాదు అతను విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడడం గానీ సోషల్ మీడియాలో ఉద్రేకపూరిత ప్రసంగాలు పోస్ట్ చేయకూడదని న్యాయస్థానం షరతులు విధించింది.