365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 31,2024 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి మైనారిటీల సంక్షేమం కోసం రూ.3003 కోట్లు బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారికి తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి రూ.3003 కోట్ల బడ్జెట్ కేటాయించగా, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని మైనారిటీ సంక్షేమానికి రూ.3183 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం అని అన్నారు. ఈ మేరకు తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మైనారిటీల బడ్జెట్ కలిపితే, అది మైనారిటీల కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కంటే 3 రెట్లు అవుతుంది. ఇంకా కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన బడ్జెట్ అంచనాలు కొన్ని పథకాలలో పెద్దగా మార్పు కనిపించలేదు.
మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3,097.60 కోట్ల నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.3,183.24 కోట్లకు పెంచారని, దీన్నిబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో అర్థమవుతోందని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నిలబెట్టుకున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి,ఉపముఖ్యమంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.