365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, మే 25,2022: ఆకాశగంగలో వందల సంవత్సరాల క్రితం నుండి శ్రీ బాలాంజనేయస్వామివారు వెలసి ఉన్నారని, 2016వ సంవత్సరంలో ఇక్కడి ఆలయాన్ని టిటిడి పునర్నిర్మించిందని, ప్రస్తుతం భక్తుల రాక పెరుగుతుండడంతో పలు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభ మయ్యాయి. ముందుగా ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయస్వామివారికి జరిగిన అభిషేకంలో ఈవో దంపతులు పాల్గొన్నారు. అనంతరం జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయస్వామివారికి ఈవో పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం జపాలి తీర్థం వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమంతుల వారు అంజనాదేవి తపోఫలితంగా వాయుదేవుని వరప్రసాదంతో అంజనాద్రిలో జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ విషయాన్ని పండిత పరిషత్ ఒక సంవత్సరం పాటు పరిశోధించి పురాణ, చారిత్రక, శాసన, భౌగోళిక ఆధారాలతో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిగా ప్రకటించి ఒక పుస్తకం ముద్రించినట్టు తెలిపారు. హనుమజ్జయంతి సందర్భంగా హనుమ జన్మస్థానమైన ఆకాశగంగ తీర్థంలోని శ్రీ బాలంజనేయస్వామివారికి ఐదు రోజుల పాటు అభిషేకం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా నాదనీరాజనం వేదిక, ఆకాశగంగ, జపాలి ప్రాంతాల్లో ధార్మికోపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఐదో రోజున మే 29న ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగనుందని, హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2808 శ్లోకాలను పండితులు పారాయణం చేస్తారని చెప్పారు. హనుమంతుడు ఎలా అయితే విశ్రాంతి లేకుండా రామకార్యం కోసం వెళ్లారో అదేవిధంగా పండితులు నిరంతరాయంగా 18 గంటల పాటు పారాయణం చేస్తారని తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు.
జాపాలి మహర్షి త్రేతాయుగంలో ఆకాశగంగలో తపస్సు చేయడంతో హనుమంతుడు ప్రత్యక్షమై వరాలిచ్చారని, అనంతరం ఇక్కడి జాపాలి తీర్థంలో హనుమంతుని విగ్రహాన్ని మహర్షి ప్రతిష్టించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఇక్కడి స్వామివారిని, ఆకాశగంగలో జన్మించిన శ్రీ బాలాంజనేయస్వామివారిని భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో..
ఇందులో భాగంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి మధ్యాహ్నం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తిరుమలలోని స్థానికులు, భక్తులు తిరుమల నుండి ఏడవ మైలుకు వెళ్లడానికి టిటిడి ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది.