365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి31, 2023: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలో మటన్ క్యాంటీన్స్ కొలువు దీరనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మటన్ క్యాంటీన్లను ప్రారంభిస్తామని గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.
చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గొర్రెలు,మేకలు ఫెడరేషన్ వార్షిక పురోగతి సంపుటిని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీస్సులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న గొర్రెల పంపిణీ పథకం దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చి పెట్టిందనీ, ఈ పథకం వివిధ రాష్ట్రాల ప్రశంసలు పొందిందనీ తెలిపారు.
కర్ణాటక, మహారాష్ట్ర,ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల ప్రతినిధులు మన రాష్ట్రాన్ని సందర్శించి ఈ పథకం అమలు తీరును దీని ద్వారా జరిగిన అభివృద్ధిని కళ్లారా చూసి ప్రశంసించడం జరిగిందని తెలిపారు.
క్షేత్రస్థాయిలో గొర్రె పెంపకదారుల సమస్యలను తెలుసుకోవడానికి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని, గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారుల అవగాహన సదస్సులు గొర్రెలకు వ్యాక్సినేషన్, నట్టల నివారణ మొదలైన కార్యక్రమాలు ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినూత్నంగా జరుగుతున్నాయని చైర్మన్ చెప్పారు.
అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి చొరవతో ప్రత్యేక అంబులెన్స్ పశువుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాదు1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో ఉన్న గ్రామాలకు సైతం ఇంటి వద్దనే పశువులకు అత్యవసర వైద్యం అందిస్తున్నమని తెలిపారు.
అంతేకాకుండా గొర్రెల పెంపకదారులు ప్రమాదవశాత్తు చనిపోతే, వారికి గొర్రెలు, మేకలఫెడరేషన్ ద్వారా ఒక లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా కూడా అందజేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
రాబోయే రోజుల్లో గొర్రెల మేకల పెంపకదారులందరికీ పింఛన్ సౌకర్యం తోపాటు వారికి, వారి జీవాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా గొర్రెల,మేకల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, గొర్రెల మేకల ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా.రామ్ చందర్, తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ మంజువాణి, డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.