365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 3,2022: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో శనివారం భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ జయంతి సందర్భంగా జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను యూనివర్సిటీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సీమ, డీన్ ఆఫ్ పీ జీ స్టడీస్ డాక్టర్ అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రాంగణంలో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. పలు పాఠశాలలకి చెందిన సుమారు1,500 విద్యార్థిని, విద్యార్థులు ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు.
వ్యవసాయం, నూతన టెక్నాలజీలు, ఇతర విషయాల పై భోదన సిబ్బంది విద్యార్థులకు ఆయా ప్రాజెక్టులపై అవగాహన కల్పించారు. “జాతీయ అభివృద్ధిలో వ్యవసాయం పాత్ర” అనే అంశంపై విద్యార్థులకు ఇంగ్లీష్, తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహించారు. రెండు భాషల్లోనూ ప్రథమ,ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు.
ఈ కార్యక్రమం కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి.నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ జెల్లా సత్యనారాయణ, ఇతర భోదన, బోధనేతర సిబ్బందితదితరులు పాల్గొన్నారు.