రచన: శాంతను రాజ్, హెడ్ ఆఫ్ మార్కెటింగ్, గోద్రేజ్ జెర్సీ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 26,2025: పాల కొరతతో ఇబ్బడిముబ్బడిగా ఉన్న దేశం నుంచి… ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఎదిగిన భారత్! ఈ అద్భుత పరివర్తనకు మూలస్తంభం – శ్వేత విప్లవ నిర్మాత, ‘మిల్క్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ డాక్టర్ వర్గీస్ కురియన్. ఆ మహానుభావుడి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. లక్షలాది మంది రైతులకు ఆర్థిక స్వాతంత్ర్యం, స్వేచ్ఛా సంకెళ్లు తెంచి సంపద సృష్టించిన ఆ యజ్ఞం ఈ రోజున మరింత గౌరవంగా గుర్తుచేసుకుంటున్నాం.

అయితే ఈ దినోత్సవం కేవలం గతాన్ని స్మరించుకోవడం మాత్రమే కాదు… ఎంత దూరం వచ్చామో చూసుకోవడం, ముందుకు ఏ మార్గంలో సాగాలో ఆలోచించడం కూడా. భారత పాడి రంగం ఇప్పుడు కొత్త దశలో అడుగుపెడుతోంది. పరిమాణం నుంచి నాణ్యత వైపు… ఉత్పత్తి నుంచి పోషకాహారం వైపు… సాంప్రదాయం నుంచి ఆవిష్కరణ వైపు పరుగులు పెడుతోంది. ఇది ‘పోషక విప్లవం’ – ఆరోగ్యం, స్థిరత్వం, సాంకేతికతలపై ఆధారపడిన నూతన యుగం.

పరిమాణం దాటి… నాణ్యత, పోషకాహారం వైపు

శ్వేత విప్లవం లక్ష్యం అందరికీ పాలు అందేలా చేయడం. కానీ ఈ రోజు ప్రశ్న మారింది – పాలు ఎంత మోతాదులో ఉన్నాయి అనేది కాదు, ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయి అనేది. భారతీయ వినియోగదారుడు మారాడు. అతను ఇప్పుడు లేబుల్ చదివి, ప్రోటీన్ శాతం చూసి, స్వచ్ఛత గురించి ప్రశ్నిస్తాడు. నైతికంగా సేకరించిన, రసాయనాలు లేని, గుర్తింపబడే మూలం ఉన్న పాల ఉత్పత్తులే ఇష్టపడుతున్నాడు. పాలు ఇప్పుడు కేవలం ఆహారం కాదు… మొత్తం ఆరోగ్య ప్యాకేజీగా మారుతున్నాయి.

విలువ ఆధారిత ఉత్పత్తులు – కొత్త డిమాండ్

పట్టణీకరణ, ఫిట్‌నెస్ అవగాహన పెరిగిన నేపథ్యంలో రుచిగల పాలు, ప్రోబయోటిక్ పెరుగు, అధిక ప్రోటీన్ పానీయాలు, పనీర్, చీజ్‌లకు భారీ గిరాకీ పెరిగింది. ప్రోటీన్ లోపం ఉన్న భారతీయ ఆహారంలో ఈ ఉత్పత్తులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. యువతకు పాల ఉత్పత్తులంటే సంప్రదాయం కాదు… రుచి, ఆరోగ్యం, సౌలభ్యం మిళితమైన ఆధునిక ఎంపిక.

సాంకేతికత – కొత్త భాగస్వామి

పొలం నుంచి ఫ్రిజ్ వరకు ప్రతి చుక్క పాలు ఇప్పుడు ట్రాక్ అవుతున్నాయి. ఐఓటీ, ఏఐ, డిజిటల్ ట్రేసబిలిటీ వంటి సాంకేతికతలు నాణ్యత, తాజాదనం, భద్రతను కాపాడుతున్నాయి. రైతులకూ లాభం – డేటా ఆధారిత సలహాలతో పశువుల ఆరోగ్యం, దిగుబడి పెరుగుతున్నాయి. సాంకేతికత + సంప్రదాయ పద్ధతుల మేళవింపే భవిష్యత్‌ను నిర్దేశిస్తున్నాయి.

స్థిరత్వం కోసం సహకారం అవసరం

ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలి. నాణ్యతా ప్రమాణాలు, పర్యావరణ అనుకూల విధానాలు, రైతుల శిక్షణ, పరిశోధన – ఇవన్నీ కలిపి స్థిరమైన పాడి రంగాన్ని తీర్చిదిద్దాలి.

భారత పాడి రంగ ప్రయాణం స్వయం సమృద్ధి కోసం ప్రారంభమైంది. ఇప్పుడది మెరుగైన ఆరోగ్యం, ఉన్నత నాణ్యత, స్థిరమైన వృద్ధి వైపు సాగుతోంది. తదుపరి విప్లవం లీటర్ల సంఖ్యతో కాదు… పోషక విలువ, మెరుగైన జీవితాలు, పర్యావరణ పరిరక్షణతో కొలవబడుతుంది.