365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,ఏప్రిల్ 7,2023: ప్రపంచాన్ని మరింత లోతుగా, విస్తృతంగా అర్థం చేసుకోవడానికి సాంకేతిక పరిజ్జానం ఒక లెన్స్ లాగా పనిచేస్తోంది.
అలా విద్యలో సాంకేతికతను ప్రవేశపెట్టడం వల్ల వినూత్న,సమగ్ర అభ్యాసం పొందడం మొదలైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి.
‘వర్చువల్ హైదరాబాద్ టుడే కాంక్లేవ్’ లో ప్రముఖ విద్యావేత్తలు ‘రోల్ ఆఫ్ ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్@ఎన్ఈపీ 2020’ పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ప్రముఖ ప్యానలిస్టులుగా సీడీఎల్టీఆర్ యూనివర్సిటీ ఆప్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జేవీ మధుసూదన్, ఢిల్లీ జేపీఎస్ డైరెక్టర్ డాక్టర్ మధు వేద్, డాక్టర్ కేఎం చేరియన్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ డైరెక్టర్ రేమా అలెక్స్ డానియల్, న్యూఢిల్లీలోని అనాన్, గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆర్తి గిరిధర్ పాల్గొన్నారు.
మహేంద్రా హిల్స్ డీపీఎస్ ప్రిన్సిపాల్ నందితా సుంకర ప్యానలిస్టులకు స్వాగతం పలికి, ప్రేక్షకులకు వారిని పరిచయం చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నాణ్యమైన అభ్యాసానికి బోధనా విధానంగా ఆర్ట్ ఇంటిగ్రేషన్ పై చర్చతో సదస్సు మొదలైంది. వనరులను సమీకరించడం ద్వారా సహకార బోధనకు ఐసీటీ సహాయపడుతుందని,అద్భుతమైన అభ్యాస అనుభవాన్ని ఇస్తుందని తెలిపారు.

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు డిజిటల్ ప్లాట్ఫామ్ ను సమర్థవంతమైన సాధనంగా ఉపయోగించే మార్గాలను చర్చించారు. ఈ చర్చలో విద్యార్థుల మనస్తత్వాలు, ఆలోచనా విధానం, వారి తెలివితేటలు ఎలా ఉంటాయో వివరించారు.
జ్ఞానం, నైపుణ్యం, మాట్లాడే విధానం, ప్రోత్సహం లేకపోవడం, పర్యావరణం అనేవి విద్యార్థిపై ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. విద్యార్థుల బలం, బలహీనతలను ఉపాధ్యాయులు తెలుసుకుని, వాటికి అనుగుణంగా వివిధ రకాల బోధనా పద్ధతులను అనుసరించాలని తెలిపారు.
సైకో సోషల్ ఫ్యాక్టర్స్, విద్యార్థుల ఆలోచనావిధానం, టీమ్ వర్క్, విద్యార్ధుల EQ, IQ, SQ లెవెల్స్ ను గుర్తించి వాటికి తగినట్టు ప్రాజెక్టు వర్కులు ఇచ్చి వారిలో సామర్థ్యాన్ని ఉపాధ్యాయులు పెంపొందించాలి.
విద్యార్థికి, ఉపాధ్యాయుడికి గల సంబంధాన్ని చక్కగా వివరించారు శ్రీమతి నందితా సుంకర. వారి సమన్వయంతో నిర్వహించిన అంతర్దృష్టితో కూడిన ఈ సదస్సు ప్రేక్షకుల ప్రశ్నోత్తరాలతో ముగిసింది.