365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 18,2022: నెట్‌వర్కింగ్ వ్యవస్థను పటిష్టం చేయకుండా, పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలు కల్పించకుండా ‘ఏపీ సిమ్స్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్ ద్వారా ఉపాధ్యాయులు,విద్యార్థుల పేషియల్ అటెండెన్స్ ను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రక్రియలో లోపాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ఉపాధ్యాయులు తమ హాజరు నమోదు చేయడంలో విఫలమవుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే ముందుగా హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులు అంటున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన పాఠశాలలో 23 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, వారిలో ఇద్దరు మాత్రమే తమ హాజరు నమోదు చేసుకోగలిగారని చెప్పారు. మిగిలిన ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్‌లలో నెట్‌వర్క్ యాక్సెసిబిలిటీ సరిగా లేదు. దీంతో సర్వర్లు మద్దతు ఇవ్వడంలేదు.
తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల నుంచి ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు హాజరు నమోదు చేసుకోవాలి. అలా చేయడంలో విఫలమైతే, వారు హాఫ్ డే లీవ్ లేదా జీతం కోల్పోతారు. నెట్‌వర్క్ సమస్యల కారణంగా బయోమెట్రిక్ విధానం కూడా అంతగా విజయవంతం కాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పలువురు ప్రధానోపాధ్యాయులకు తమ సమస్యలను తెలియజేసారు. తిరుపతిలోని కొందరు ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్‌లలో భద్రపరిచిన తమ వ్యక్తిగత డేటాకు సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్లపై భయాందోళనలు వ్యక్తం చేశారు. ఫేస్ రికగ్నిషన్ కోసం ప్రత్యేక మొబైల్ ఫోన్‌ను ప్రభుత్వం సరఫరా చేయాలని కొందరు భావిస్తున్నారు.
ఉపాధ్యాయులు బోధనతో పాటు అనేక ఇతర పనులతో ఇప్పటికే ఓవర్‌లోడ్‌తో ఉన్నారని,ఆ అదనపు బాధ్యతల నుంచి వారిని విముక్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలు నెట్‌వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోని ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
వారి తప్పు లేకుండా హాఫ్ డే లీవ్ లేదా జీతం ఎందుకు పోగొట్టుకోవాలి అని కొందరు ప్రశ్నించారు. ఉపాధ్యాయులను ఇలా వేధించడం సరికాదన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ముత్యాల రెడ్డి మాట్లాడుతూ.. నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరించి ఉపాధ్యాయులకు ప్రత్యేక పరికరాలు ఇచ్చేంత వరకు ప్రభుత్వం కొత్త నిబంధనను నిలుపుదల చేయాలన్నారు.