365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే14,2023: డిజిటల్ జర్నలిజంలో సవాళ్లపై సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ లో శనివారం ఎండ్‌నౌ ఫౌండేషన్ , తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (TSPCC) సంయుక్త ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల కోసం వర్క్‌షాప్ నిర్వహించారు.

డిజిటల్ మీడియా జర్నలిస్టులు ప్రచురించే వార్తల విశ్వసనీయతను మెరుగుపరచడంతోపాటు, సమాచారాన్ని ప్రచురించే ముందు దాని వ్యాలిడిటీని నిర్ధారించడమేకాకుండా వాస్తవ సమాచారం, తప్పుడు సమాచారాల మధ్య తేడాను ఎలా గుర్తించాలో అర్థం చేసుకోవడానికి వారికి ఫ్యాక్ట్ చెక్ చేసే సాధనాలను ఎలా ఉపయోగించాలనే విషయాలు వర్క్‌షాప్ లో చర్చించారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, “నేటి సమాచార యుగంలో ప్రజలను తప్పుదారి పట్టించే వార్తలు పెరుగుతున్నాయని అన్నారు. అటువంటి వార్తలను నియంత్రించాలని కోరారు”. అందులో డిజిటల్ మీడియాది కీలక పాత్ర అని ఆయన తెలిపారు.

తెలంగాణ టుడే ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి సిటిజన్‌ జర్నలిజం గురించి చెబుతూ, దాని వరాలను, బాసటలను, దానివల్ల వచ్చే బాధ్యతలను వివరించారు. ఇంతకుముందు సమాచార వ్యాప్తి ఒకలా ఉందని, ఇప్పుడు మరిన్ని మాధ్యమాలు తప్పుడు వార్తలను ప్రచారం చేయడంతో ప్రజలు గందరగోళానికి గురిఅవుతున్నారని ఆయన వివరించారు.

ది హిందూ మాజీ జర్నలిస్ట్, సోమ శేఖర్ మాట్లాడుతూ.. “జర్నలిస్టులు సమాచార సేకరణలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. డిజిటల్ మీడియాలో ధృవీకరించని సమాచారం ఉండటం కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తుందని తెలిపారు.

జర్నలిజంలో ఎదురయ్యే వివిధ అనుభవాల కారణంగా జర్నలిస్టులు ఎదుర్కొనే మానసిక సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి సైకియాట్రిస్ట్ డాక్టర్ సోనియా శర్మ వివరించారు.

ఈ వర్క్‌షాప్‌లో ఫ్యాక్ట్‌లీ వ్యవస్థాపకుడు రాకేష్ ఫ్యాక్ట్ ఫైండింగ్ సెషన్‌లో నకిలీ వార్తలు, సమాచారాన్ని ఎలా సృష్టించవచ్చు, వార్తగా ప్రచురించ వచ్చు, మతపరమైన అల్లర్లు, పలు సున్నితమైన అంశాలకు సంబంధించి ప్రత్యక్ష ఉదాహరణలతో సహా విపులంగా చెప్పారు.

ఎండ్‌నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అనిల్ రాచమల్ల మాట్లాడుతూ సమర్థవంతమైన రిపోర్టింగ్ కోసం సమాచారాన్నిసేకరించడానికి, విశ్లేషించడానికి డిజిటల్ ఇంటెలిజెన్స్ జర్నలిస్టులకు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.

సుప్రీంకోర్టు న్యాయవాది సాయి తేజ కావేటి మాట్లాడుతూ..”భావప్రకటనా స్వేచ్ఛను కల్పించే రాజ్యాంగంలోని అధికరణలు, సహేతుకమైన పరిమితుల గురించి సవివరంగా చెప్పారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఎడిటర్ సుశీల్ రావు మాట్లాడుతూ..జర్నలిజం నైతికత గురించి, పుకార్లు సృష్టించడం లేదా వాటిని వ్యాప్తి చేయడం ఎలా జరుగుతుందో అనే విషయాలను ఉదాహరణలతో తెలిపారు. విషయం మూలాల్లోకి వెళ్లి పుకార్లు, అపోహలను ఛేదించడం జర్నలిస్టుల విధి అని వివరించారు.

సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మాట్లాడుతూ ఫేక్ న్యూస్‌లకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను శానిటైజ్ చేయడంలో జర్నలిస్టులందరూ భాగస్వాములు కావాలన్నారు.