365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్,జూన్ 28,2022:ఏపీలో రాజకీయఅగ్గి రాజుకుంది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ‘నా శత్రువును నువ్వు ప్రోత్సహిస్తే.. నీ శత్రువును నేను ప్రోత్సహిస్తా.. నేను ఏ పార్టీకి చెందినవాణ్ని కాదు’అంటూ టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. బెజవాడ టీడీపీలో ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రీసెంట్‌గా కేశినేని నానితో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేసిన నాని సొంత పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఇటీవల విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో.. టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతోనే కేశినేని నాని ఈ తరహా వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ నానికి టికెట్ ఇవ్వదని.. ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అలియస్ చిన్నిఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది . ఇటీవల ఇటీవల ‘మహానాడు’లోనూ చిన్ని చురుగ్గా వ్యవహరించారు.
టీడీపీ బలంగా ఉండే విజయవాడ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో.. దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరా తదితర నేతలకు స్థానిక ఎంపీ నానితో పొసగడం లేదు. అదే సమయంలో పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ నేతలు కూడా ఇప్పటికే కేశినేని చిన్నితో టచ్‌లో ఉంటున్నారు. ఈ పరిణామల నేపథ్యంలో ఎంపీ నాని ఒంటరిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
ఎంపీ నాని వ్యవహార శైలి నచ్చకపోవడం వల్లే ఆయనకి చెక్ పెట్టడం కోసం.. ఆయన తమ్ముడైన చిన్నిని పార్టీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలో తన సోదరుడికి బాసటగా నిలిచిన చిన్ని.. 2019 ఎన్నికల సమయంలో తన అన్న తీరు నచ్చక దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిన చిన్నితో చంద్రబాబు, లోకేశ్.. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో మంతనాలు జరిపారని టాక్.
ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొనే నాని ‘శత్రువు’ ప్రస్తావన తెచ్చారనే భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి టీడీపీ నేతలకు, అధిష్టానానికి కొరగాని కొయ్యగా మారిన నానిని పార్టీ వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు బెజవాడ తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.