Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,అమరావతి, జనవరి26th, 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్ని, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.

రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు.

error: Content is protected !!