365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మార్చి 31,2023: నరసింగా పురంలోని శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీలో నూతనంగా నిర్మించిన ఔషధ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి ప్రారంభించారు.
అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్,ఈవో నూతన భవనంతో పాటు మందుల ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
పూర్వీకులు మనకు అందించిన ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి టీటీడీ ఎంతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 1983లో ఆయుర్వేద వైద్య కళాశాలను, దానికి అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆయుర్వేద ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వస్తున్న రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోందన్నారు.
ఆయుర్వేద ఆసుపత్రికి అవసరమయ్యే మందులు సొంతంగా తయారుచేసుకోవడం కోసం నరసింగాపురంలో 1990వ సంవత్సరంలో 14.75 ఎకరాల్లో టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
మొదట 10 రకాల మందులు మాత్రమే తయారు చేసిన ఈ ఫార్మసీ క్రమేణా 80 రకాల మందులు తయారు చేసి ఆయుర్వేద ఆసుపత్రితో పాటు తిరుపతి, తిరుమలలో డిస్పెన్సరీలకు సరఫరా చేస్తోందన్నారు. ఫార్మసీని మరింత అభివృద్ధి చేసి ఆయుర్వేద వైద్యాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయడానికి మా పాలకమండలి నిర్ణయించిందని చైర్మన్ వివరించారు.
ఇందుకోసం ఫార్మసీ భవనాలనూ ఆధునీకరించడంతో పాటు, మూడు ఔషధఉత్పత్తి కేంద్రాలను నిర్మించి రూ.3.90 కోట్లతో అధునాతన యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో మొదట విడతగా తొలి ఔషధ ఉత్పత్తి కేంద్రం శుక్రవారం ప్రారంభించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు.
ఇప్పటిదాకా సంవత్సరానికి రూ.1.5 కోట్లు విలువ గల మందులను తయారు చేసే ఈ ఫార్మసీలో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి ఏడాదికి రూ.5 కోట్ల విలువ చేసే మందులను తయారు చేసే సామర్థ్యం లభిస్తుందని ఆయన తెలిపారు.
ఇక్కడ తయారుచేసే ఆయుర్వేద మందులను టీటీడీ అవసరాలకు పోను, మిగిలినవి ఆయుష్ వైద్య శాలలకు విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని చైర్మన్ చెప్పారు. కొన్ని ప్రత్యేకమైన, ప్రాచుర్యం పొందిన మందులను టీటీడీ విక్రయశాలల్లో ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు.
శుక్రవారం ప్రారంభించిన ఉత్పత్తి కేంద్రంలో మొదటి విడతగా 10 రకాల ఔషధాలు తయారు చేస్తారన్నారు. భవిష్యత్‌లో 314 నూతన ఔషధాలు తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
జేఈవో సదా భార్గవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ , ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం,ఈఈ మురళీ కృష్ణ, విజివో మనోహర్ ,ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక అధికారి డాక్టర్ నారప రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.