365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 25,2025: కాలేయ వైఫల్యం.. నేటి సమాజంలో ఎంతోమందిని పట్టి పీడిస్తున్న సమస్య. కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేని ఈ వ్యాధికి, హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) లోని ఓ స్టార్టప్ వినూత్న చికిత్సను విజయవంతంగా పరీక్షించింది. స్టెమ్ సెల్స్‌ను ఉపయోగించి ఈ కొత్త చికిత్సను అభివృద్ధి చేసింది.
‘తులసి-28X’ – సరికొత్త ఆవిష్కరణ..
‘తులసి-28X’ అని పిలిచే ఈ చికిత్సను, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్టెమ్ సెల్స్, ఎక్సోసోమ్‌లు (సహజ వైద్య కణాలు) ప్రత్యేక కలయికతో రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ఈ కణాలను బొడ్డు తాడులోని “వార్టన్ జెల్లీ” నుంచి సేకరిస్తారు.
ఈ కాన్సెప్ట్ అమెరికాలో పుట్టినా, మొత్తం ప్లాట్‌ఫారమ్‌ను మాత్రం భారత్‌లోనే, UoHకి చెందిన ASPIRE-BioNEST బయోటెక్ ఇంక్యుబేటర్‌లో మూడేళ్ల సుదీర్ఘ పరిశోధన తర్వాత ‘తులసి థెరప్యూటిక్స్’ అభివృద్ధి చేసింది.
ఎలుకలపై విజయవంతమైన ప్రయోగాలు..
“మేము ఎలుకలపై ప్రయోగాలు చేశాము. ‘తులసి-28X’తో చికిత్స పొందిన అన్ని ఎలుకలలో కాలేయ ఫైబ్రోసిస్ తగ్గి, కాలేయం పునరుత్పత్తి అయ్యింది. చికిత్స పొందిన ఎలుకలలో మరణాలు సున్నా శాతం నమోదు కాగా, చికిత్స పొందని ఎలుకల సమూహంలో కేవలం 14శాతం మాత్రమే మెరుగుదల కనిపించింది.
అక్కడ 43శాతం మరణాలు సంభవించాయి” అని తులసి థెరప్యూటిక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ డా.సాయిరాం అట్లూరి వెల్లడించారు. ఈ ప్రీక్లినికల్ ట్రయల్స్ ఇండియానా యూనివర్సిటీ (US) అండ్ PGIMER (చండీగఢ్) సహకారంతో నిర్వహించారు.
కాలేయ మార్పిడికి ప్రత్యామ్నాయం..
కాలేయ వైఫల్యంతో బాధపడుతూ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ చికిత్సా విధానం ఒక ‘గేమ్ ఛేంజర్’ కాగలదని డాక్టర్ అట్లూరి అభిప్రాయపడ్డారు. “ప్రస్తుతం కాలేయ వైఫల్యానికి ఉన్న ఏకైక చికిత్స కాలేయ మార్పిడి.
అయితే, దాతలు తక్కువగా ఉండటం, చికిత్స చాలా ఖరీదైనది కావడం, వివిధ సమస్యలు ఎదురవడం వంటి ఇబ్బందులున్నాయి. మేము అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని నేరుగా నరాల ద్వారా ఇవ్వవచ్చు” అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను అమెరికా నుంచి భారతదేశానికి వచ్చానని డాక్టర్ అట్లూరి పేర్కొన్నారు.

మానవ ప్రయోగాలకు దరఖాస్తు..
ఈ స్టార్టప్ ఇప్పటికే మానవ ప్రయోగాలను నిర్వహించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) కు దరఖాస్తు చేసుకుంది. “ప్రపంచ స్థాయి, సరసమైన పునరుత్పత్తి పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని స్టార్టప్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ రవి బొంతల అన్నారు.
“మా తదుపరి దశ, నిమ్స్ (నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సహకారంతో ‘తులసి-28X’ ను మానవ క్లినికల్ ట్రయల్స్‌లోకి తీసుకెళ్లడం” అని ఆయన వివరించారు.