Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,2023: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం తీవ్ర నష్టాల్లో కూరుకు పోయాయి. బెంచ్‌ మార్క్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ ఉదయం నుంచే నేలముఖం పట్టాయి. ఈ నెలలోనే అత్యతధిక పతనాన్ని చవిచూశాయి. ఆసియాకు తోడుగా గ్లోబల్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఒక కారణం.

పనిలో పనిగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం.. క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ ఇండెక్స్‌, యూఎస్‌ బాండ్‌ యీల్డుల పెరుగుదల వంటివి ఇతర కారణాలు. అమెరికా ఫెడ్‌ సైతం అత్యధిక వడ్డీరేట్లనే కొనసాగిస్తుందన్న అంచనాలు, ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం చేటు చేసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 231 పాయింట్లు నష్టపోగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 796 పాయింట్లు పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలహీనపడి 83.08 వద్ద స్థిరపడింది. దాంతో ఇన్వెస్టర్లు నేడు ఒక్క రోజే రూ.3 లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు.

క్రితం సెషన్లో 67,596 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 67,080 వద్ద మొదలైంది. 66,728 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,294 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 796 పాయింట్ల నష్టంతో 66,800 వద్ద ముగిసింది.

19,980 వద్ద ఓపెనైన నిఫ్టీ 19,878 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,050 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 231 పాయింట్లు తగ్గి 19,901 వద్ద క్లోజైంది.
నిఫ్టీ బ్యాంక్‌ ఎరుపెక్కింది. 595 పాయింట్ల నష్టంతో 45,384 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50 అడ్వాన్స్‌ డిక్లైన్‌ రేషియో 11:39గా ఉంది. పవర్‌ గ్రిడ్‌ (2.35%), కోల్‌ ఇండియా (1.12%), ఓఎన్జీసీ (0.75%), ఏసియన్‌ పెయింట్స్‌ (0.57%), సన్‌ ఫార్మా (0.44%) షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు (3.87%), జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ (2.70%), రిలయన్స్‌ (2.29%), బీపీసీఎల్‌ (2.07%), అల్ట్రాటెక్‌ సెమ్‌ (2.06%) అత్యధికంగా నష్టపోయాయి.

నేడు అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. ఫైనాన్స్‌, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.

నిఫ్టీ ఘోర పతనానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టపోవడమే కారణాలు. హెచ్‌డీఎఫ్‌సీ 110, రిలయన్స్‌ 41 పాయింట్ల మేర పతనంలో భాగమయ్యాయి. నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ టెక్నికల్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 20050 వద్ద రెసిస్టెన్స్‌, 19900 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి.

ఒకవేళ 19,900 స్థాయిని బ్రేక్‌ చేస్తే కొన్నాళ్లు బేర్స్‌ పట్టు సాధిస్తారు. మార్కెట్‌ సెంటిమెంటుతో సంబంధం లేకుండా ఇన్వెస్టర్లు గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌, కేఎన్‌ఆర్‌ కన్స్‌స్ట్రక్షన్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఐచర్‌ మోటార్స్‌, బర్జర్‌ పెయింట్స్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండడటం అవసరం. హైవే కన్స్‌స్ట్రక్షన్‌ నుంచి జీఆర్‌ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్‌ రూ.737 కోట్ల విలువైన ఆర్డర్‌ సొంతం చేసుకుంది. టోటల్‌ గ్యాస్‌ ఎనర్జీస్‌ పెట్టుబడికి అదానీ గ్రీన్‌ ఎనర్జీ అంగీకరించింది.

అలెంబిక్‌ ఫార్మా, అపార్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బాలకృష్ణా ఇండస్ట్రీస్‌, బర్జర్‌ పెయింట్స్‌, ఎన్టీపీసీ, టీసీఎస్‌, ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాలను తాకాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 11.8 లక్షల షేర్లు చేతులు మారాయి. రూ..1000 కోట్ల క్యూఐపీతో బ్లూస్టార్‌ షేర్లు 18 శాతం పెరిగాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.
error: Content is protected !!