365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 8, 2023: భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్‌ లాభపడ్డాయి. దాదాపుగా రెండు నెలల తర్వాత ఒక వారం మొత్తం సూచీలు ఎగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 19,800 స్థాయిని అధిగమించింది.

మరోవైపు ఆరు వారాల తర్వాత బీఎస్‌ఈ, సెన్సెక్స్‌ తొలిసారి 66,700 లెవల్‌ను దాటేసింది. ఈవారంలో రెండోసారి రియాల్టీ, మీడియా మెటల్‌ రంగాలు మార్కెట్లను ముందుకు నడిపించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 27 పైసలు బలపడి 82.95 వద్ద స్థిరపడింది.

ఇక జర్మనీ ఎకానమీ బలహీనమవ్వడం, ద్రవ్యోల్బణం ఇతర కారణాలతో ఐరోపా మార్కెట్లు ఇబ్బంది పడుతున్నాయి. Stoxx 600 వరుసగా ఎనిమిదో రోజు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటోంది.

2016 తర్వాత ఈ సూచీ ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి. ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ 100 ఫ్యూచర్స్‌ నష్టపోయాయి. నెగెటివ్‌ సెంటిమెంటుతో జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, ఆస్ట్రేలియా సూచీలు ఎరుపెక్కాయి.

క్రితం రోజు 66,265 వద్ద మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం 66,381 వద్ద మొదలైంది. 66,299 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 12 గంటల ప్రాంతంలో పుంజుకున్న సూచీల 66,766 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకొంది.

చివరికి 333 పాయింట్ల లాభంతో 66,598 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,774 వద్ద మొదలై 19,727 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకొంది. మధ్యాహ్నం 19,867 వద్ద గరిష్ఠాన్ని అందుకొన్న సూచీ మొత్తంగా 92 పాయింట్లు ఎగిసి 19,819 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 278 పాయింట్లు పెరిగి 45,156 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50 కంపెనీల్లో 32 లాభపడగా 18 నష్టపోయాయి. ఎన్టీపీసీ(2.73%), కోల్‌ ఇండియా (2.65%), బీపీసీఎల్‌ (2.06%), టాటా మోటార్స్‌ (1.96%), ఎల్‌టీ (1.88%) షేర్లు టాప్‌ గెయినర్స్‌గా అవతరించాయి. యూపీఎల్‌ (1.03%), ఐచర్‌ మోటార్స్‌ (0.90%), అపోలో హాస్పిటల్స్‌ (0.82%), అల్ట్రాటెక్‌ సెమ్‌ (0.77%), ఎస్బీఐ లైఫ్ (0.75%) టాప్‌ లాసర్స్‌గా ఉన్నాయి.

మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీల పరుగు కొనసాగుతోంది. మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎగిశాయి.

నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,900 వద్ద రెసిస్టెన్సీ, 19,780 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి. ఇన్వెస్టర్లు నియర్‌ టర్మ్‌లో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, గుజరాత్‌ గ్యాస్‌, హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌, హెచ్‌జీఎస్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

ఆర్బీఐ దశల వారీగా ఐ-సీఆర్‌ఆర్‌ అవసరాన్ని క్రమంగా తగ్గిస్తామని తెలిపింది. దాంతో చాలా వరకు బ్యాంకింగ్‌ షేర్లు పెరిగాయి. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ షేర్లు ఏకంగా 12 శాతం పెరిగి రూ.303 వద్ద ముగిశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ షేరు 114 శాతం లాభపడింది. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ శోభా లిమిటెడ్‌ షేర్లు 15 శాతం పెరిగి 11 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.

సీజీ పవర్‌, కోల్‌ ఇండియా దీపక్‌ నైట్రేట్‌, దేవయాని ఇంటర్నేషనల్‌, డీఎల్‌ఎఫ్‌, గెయిల్‌, హవెల్స్‌ ఇండియా, హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌, ఇండస్ఇండ్‌ బ్యాంకు, ఓబెరాయ్‌ రియాల్టీ, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ట్రెంట్‌, టీవీఎస్‌ మోటార్స్‌ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రైల్వే స్టాక్స్‌ చాలా వరకు పెరిగాయి. నిఫ్టీ ఆటో, స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు గరిష్ఠాలకు ఎగిశాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.