365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,అక్టోబర్ 2, 2020:హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క కీలక పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హేమంత్ డైరెక్షన్ లో అనుష్క ను ఈ చిత్రంలో దివ్యాంగురాలిగా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మూగ, చెవిటి పాత్రలో క్రేజీ హీరోయిన్ ను చూపించడం చాలెంజింగ్ తీసుకున్న డైరెక్టర్ హేమంత్ మధుకర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం ఆలస్యంగా ఓటీటీలో విడుదలయ్యింది. అనుష్క మరి ‘నిశ్శబ్దం’ ఎలా ఉంది? సినిమాలో ప్లస్ లు , మైనస్ లు ఈ రివ్యూలో చూద్దాం….
స్టోరీ …
అమెరికాలోని సియాటెల్‌కు 70 కి.మీ దూరంలో ఉన్న వుడ్‌సైడ్ విల్లాలో భార్యాభర్తలు పీటర్, మెలిసాలను దుండగులు హత్య చేస్తారు. ఇంటి ఓనర్ జోసెస్ ఆత్మే వారిని చంపేసిందంటూ ప్రచారం జరుగుతుంది. పోలీసులు కూడా ఈ కేసును ఛేదించలేక ముప్పుతిప్పలు పడతారు. దీంతో హాంటెడ్ హౌస్ గా భావించే ఆ విల్లాను కొనేందుకు ఎవరూ ముందుకు రారు. 2019లో కొలంబియాకు చెందిన బిజినెస్‌మేన్ మార్టిన్ ఎస్కవాడో ధైర్యం చేసి ఆ విల్లాను కొంటాడు. సాక్షి (అనుష్క) చెవిటి, మూగ అమ్మాయి. అంతేకాదు, మంచి పెయింటర్ కూడా . మరోవైపు ఆంటోని (మాధవన్) సెలబ్రిటీ మ్యుజీషియన్. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఎంగేజ్‌మెంట్ తరవాత ట్రిప్ లో భాగంగా వీరిద్దరూ కలిసి హాంటెడ్ హౌస్ గా భావించే ఆ విల్లాలోకి సాక్షి, ఆంటోని వస్తారు. ఇప్పుడు అదే ఇంటిలో ఆంటోని కూడా హత్యకు గురవుతాడు. కానీ, సాక్షి గాయాలతో తప్పించుకుంటుంది. అసలు ఆంటోనిని హత్య చేసింది ఎవరు? మూగ అమ్మాయి అయిన సాక్షి పోలీసులకు ఎలా సహకరించింది? పోలీస్ ఆఫీసర్ అయిన రిచర్డ్(మైకేల్ మాడిసన్), క్రైమ్ డిటెక్టివ్ మహాలక్ష్మి(అంజలి)తో కలిసి ఎలా చేధించారు. ఈ హత్యకూ సోనాలి(షాలినీ పాండే), వివేక్(సుబ్బరాజు)లకు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే.
దర్శకుడు హేమంత్ మధుకర్ మార్క్ కనిపించింది..
సరిగ్గా తీయాలే గానీ క్రైమ్ థిల్లర్స్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. స్క్రీన్ ప్లే ఇలాంటి సినిమాలకు ప్రధాన బలం. ఎందుకంటే ఇటువంటి సినిమాలకు నేపథ్యాలు ఇంచు మించు ఒకేలా ఉంటాయి. దర్శకుడు హేమంత్ మధుకర్.. ‘నిశ్శబ్దం’ కథను పవర్ ఫుల్ గా రాసుకున్నారు. కథ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆంటోని హత్య ఉదంతం …దాని చుట్టూ పాత్రలు మలచుకుని కథను మరింత ఆసక్తి గా చూపాడు. సినిమా సగం పార్ట్ వరకూ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మధ్యలో నుంచి కాస్త గాడితప్పినట్లు అనిపించినా కాస్త థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అప్పటివరకూ ఆ హత్యను ఎవరెవరు చేసి ఉంటారని ఊహిస్తున్న ప్రేక్షకుడు.. విరామ సమయానికొచ్చే సరికి ఒక వ్యక్తి దగ్గర ఆగిపోతాడు. అయితే, ఆ వ్యక్తి ఆంటోనిని ఎందుకు హత్య చేశాడన్న కోణంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ్నుంచి కథ ప్రేక్షకుడి ఊహాజనితంగానే ఉంటుంది. కొన్ని ట్విస్టలు మాత్రం చాలా సూపర్బ్ గా ఉన్నాయి. వాటిని రివీల్ చేసే విధానం ఇంకా ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేదనిపించింది. సినిమా మొత్తాన్ని అమెరికా నేపథ్యంలోని సీటల్, సీక్విమ్ నగరాల పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించడంతో హాలీవుడ్ లుక్ తీసుకువచ్చారు. మొత్తం మీద దర్శకుడు హేమంత్ మధుకర్ మార్క్ ఈ చిత్రం ద్వారా కనిపించింది..
ఎవరెవరు ఎలా నటించారంటే…?
దివ్యాంగురాలి పాత్రలో అనుష్క సూపర్బ్ గా అదరగొట్టింది. ఇలాంటి ఛాలెజింగ్ పాత్రలకు తానెంత అవసరమో మరోసారి నిరూపించింది. సైగలు, హావభావాలతో ఎమోషన్స్ పలికించడంలో ఆమె పడిన కష్టం కనబడుతుంది. సెలబ్రిటీ మ్యుజీషియన్ గా మాధవన్ తనదైన శైలిలో నటించారు. కేసు ఛేదించే డిటెక్టివ్‌గా అంజలి నటన మెప్పించింది. రిచర్డ్ పాత్రలో హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్‌ను తీసుకోవడం వల్ల సినిమాకు ఆశించినంత ప్రయోజనం లేదు. సుబ్బరాజు, షాలిని పాండే,
అవసరాల శ్రీనివాస్ లు వారి పాత్రల్లో చాలా బాగా ఒదిగిపోయారు.
గోపీ సుందర్ అందించిన రెండు పాటలు బాగున్నాయి. షనీల్ డియో కెమెరా పనితనం చాలా గొప్పగా ఉంది. విజువల్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. గిరీష్ గోపాలక్రిష్ణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
హేమంత్ మధుకర్ దర్శకత్వం
అనుష్క, మాధవన్‌ల నటన
కథ, దర్శకత్వం: హేమంత్ మధుకర్
విడుదల: అమెజాన్ ప్రైమ్
సంగీతం: గోపీ సుందర్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
నటీనటులు: అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ మాడిసన్
365తెలుగు డాట్ కామ్ రేటింగ్: 3.5