365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జనవరి 12,2025: జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచారం పై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు… వదంతులు నమ్మవద్దు విశ్వవిద్యాలయ వర్గాలు.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం పై ఎటువంటి ఆనవాళ్లు లభ్యం కాలేదని విశ్వవిద్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.

వివిధ మీడియా ఛానళ్లు, సామాజిక మాధ్యమాలలో వచ్చిన వదంతుల నేపథ్యంలో విశ్వవిద్యాలయ సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి ఆదివారం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని పలు ప్రాంతాలలో చిరుత ఆనవాళ్ళ కోసం వెతికారు.

సుమారు 4 గంటల పాటు అటవీశాఖ అధికారులు, వ్యవసాయ విద్యాలయం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు కలిసి వివిధ ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ, ఎటువంటి చిరుత పులి పాదముద్రలు కానీ,ఆనవాళ్లు కానీ లభ్యం కాలేదని విశ్వవిద్యాలయం ఇంచార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ డాక్టర్ హుస్సేన్ తెలిపారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం అన్న అంశంపై సామాజిక మాధ్యమాలు వివిధ మీడియా ఛానళ్లు, పత్రికలలో వస్తున్న వార్తలు తో విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు ఆందోళన కలుగుతుందని, కాబట్టి వదంతులను వ్యాప్తి చేయొద్దని తద్వారా విద్యార్థులను, ఉద్యోగులను భయాందోళనకు గురిచేయొద్దని కోరారు.

విశ్వవిద్యాలయంలో చిరుత పులి సంచారం పై ఎటువంటి ఆనవాళ్లు లభ్యం కాలేదని అయినప్పటికీ నిఘా ఉంచుతున్నాం అని సెక్యూరిటీ సిబ్బందితో విశ్వవిద్యాలయంలో గస్తీ నిర్వహించి పర్యవేక్షించడం జరుగుతుందని, విద్యార్థులు కూడా తగిన జాగ్రత్తలు వహించాలని, రాత్రి వేళలో రోడ్లపై తిరుగవద్దని సూచించారు.

అలాగే వివిధ ప్రసార మాధ్యమాలలో కూడా వదంతులను వ్యాప్తి చేయొద్దని విశ్వవిద్యాలయ వర్గాలు కోరాయి. ఆదివారం శాఖ అధికారులతో కలిసి విశ్వవిద్యాలయ సెక్యూరిటీ సిబ్బంది పోలీసు అధికారులు జరిపిన పరిశీలనలోనూ.. సీసీ కెమెరాల లోనూ, నీటి సౌకర్యం ఉన్న చెరువుల వద్ద కూడా చిరుతపులికి సంబంధించిన పాదముద్రలు కానీ, ఆనవాళ్లు కానీ లభ్యం కాలేదు. అయినప్పటికీ జాగ్రత్త కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచామని వివరించారు.