365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, కర్నూలు, అక్టోబర్ 6,2022: దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన కర్రల పోరు మరోసారి రక్తసిక్తమైంది. సుమారు రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షంలోనూ మాలమల్లేశ్వర స్వామి విగ్రహం కోసం ఇరు వర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు కర్రలతో కొట్లాటలతో బన్నీ ఉత్సవం నిర్వహించారు. మాలమల్లేశ్వర స్వామి దర్శనం కోసం అర్ధరాత్రి ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకున్న పలువురు సంప్రదాయ పండుగ పేరుతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో 70 మందికి పైగా గాయపడ్డారు.
గాయపడిన భక్తులకు అక్కడికక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్షతగాత్రుల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన అధికారులు మీడియాను ఆస్పత్రిలోకి అనుమతించలేదు. ఈ సంప్రదాయ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొట్లాటను మాత్రం ఆపలేకపోయారు.

ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పండుగ చూసేందుకు కుటుంబ సభ్యులతో వచ్చిన కర్ణాటకలోని మాడ సూగూరు గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి(17) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ కర్రల సమరానికి సంబంధించి సుమారు 40 గ్రామాల ప్రజలకు, స్వామివారి భక్తులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కొన్నేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా భక్తుల్లో మార్పు రావడం లేదు.