365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 1,2025: దేశవ్యాప్తంగా వర్షాలు ఉధృతంగా పడుతున్న తరుణంలో వీధి కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలకు రక్షణగా మారేలా మార్స్ పెట్‌కేర్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సంయుక్తంగా రూపొందించిన మొబైల్ షెల్టర్ ప్రోగ్రాం ‘పా ప్రొటెక్’ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో విజయవంతంగా అమలైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చెన్నై, హైదరాబాద్ నగరాల్లోకి విస్తరించారు. మొత్తం 700కు పైగా మొబైల్ షెల్టర్లను ఇప్పటివరకు ఏర్పాటు చేశారు.
వర్షాలు, చలికాలం వంటి ప్రతికూల వాతావరణంలో వీధికుక్కలు, పిల్లులకు సురక్షితమైన, పొడి ప్రాంతం దొరకడం అనేది చాలా కీలకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ షెల్టర్లు తడి, ఉష్ణోగ్రతల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇవి స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ఫీడర్ గ్రూపుల సహకారంతో నిర్వహించబడుతుండగా, సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఫోటోలు, వీడియోలతో మద్దతు అందిస్తున్నారు.

భారత్లో అత్యధిక వీధి జంతువులు
మార్స్ పెట్‌కేర్ విడుదల చేసిన 2023 స్టేట్ ఆఫ్ పెట్ హోంలెస్‌నెస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 6.9 కోట్లకు పైగా వీధి జంతువులు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి తగిన ఆహారం, నీరు, నివాసం దొరకకపోవడం వల్ల వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘పా ప్రొటెక్’ కార్యక్రమం సమయానుకూలంగా అభినందనీయమని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
“జాలి మాత్రమే కాదు.. మానవత్వం”: అమల
ప్రముఖ నటి, జంతు సంక్షేమ కార్యకర్త అక్కినేని అమల మాట్లాడుతూ – “గూడులేని జీవాలకు నివాసం కల్పించడం కేవలం జాలి చూపించడమే కాదు, అది మానవత్వం. పా ప్రొటెక్ లాంటి చొరవలు సమాజంలో స్పష్టమైన మార్పుకు నాంది పలుకుతాయి. ఈ షెల్టర్లను రద్దీ రహదారుల నుంచి దూరంగా, శాంతమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాను” అని అన్నారు.
ఇది కూడా చదవండి…‘మోతెవరి లవ్ స్టోరీ’ నుంచి ‘గిబిలి గిబిలి’ పాట విడుదల..
ప్రముఖుల ప్రశంసలు
మార్స్ పెట్‌కేర్ ఇండియా ఎండీ సలిల్ మూర్తి మాట్లాడుతూ – “స్థానిక సంస్థలు, ఫీడర్లు, సామాజిక సంస్థల మద్దతుతో ఈ కార్యక్రమం మరింత ఫలప్రదంగా మారింది. హైదరాబాదు, చెన్నైలో ఇది అత్యవసరంగా ఉందన్న నమ్మకంతో విస్తరించాం” అన్నారు.
ఇన్‌స్టామార్ట్ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ చౌధరి మాట్లాడుతూ – “మార్స్ పెట్‌కేర్‌తో భాగస్వామ్యానికి గర్వంగా ఉంది. పా ప్రొటెక్ కార్యక్రమానికి మా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇది జంతువుల పట్ల సమాజంలోని ప్రేమకు ప్రతీక” అని తెలిపారు.

స్థానిక సంస్థల భాగస్వామ్యం
బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్, ఫ్రెండికోస్, మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ వంటి సంస్థల సహకారంతో ఈ షెల్టర్లు నిర్మించబడ్డాయి. వాతావరణ మార్పులను తట్టుకునేలా డిజైన్ చేసిన ఈ షెల్టర్లు నిర్వహణకు సులభంగా ఉండేలా రూపొందించబడ్డాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రశంసలు లభించడమే కాక, శీతాకాలంలో ఉత్తరాదిలో వీధి జంతువుల కోసం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసిన అనుభవాన్ని కూడా మార్స్ పెట్‌కేర్ గుర్తు చేస్తోంది.
ఇంకా అభివృద్ధి చెందాల్సిన ‘పా ప్రొటెక్’
ఈ మొబైల్ షెల్టర్లు దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో విస్తరించాల్సిన అవసరం ఉంది. జంతువుల సంక్షేమాన్ని సమాజం, వ్యక్తులు, సంస్థలు కలిసిపనిచేస్తేనే సమగ్ర మార్పు సాధ్యమవుతుంది. ‘పా ప్రొటెక్’ అందుకు ఆదర్శమైన ప్రారంభం అని చెప్పొచ్చు.