365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 19,2025 : ప్రస్తుతం చాలామంది ఇష్టంగా తినే ప్యాకేజ్డ్ ఫుడ్స్ (ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు) ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తాజాగా వెలువడిన ఒక నివేదిక వెల్లడించింది. ప్రతిరోజూ మనం వాడే బిస్కెట్లు, చాక్లెట్లు, నూడుల్స్ వంటి వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన దాని కంటే చాలా రెట్లు ఎక్కువ చక్కెర, కొవ్వు, సోడియం (ఉప్పు) ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇది ముఖ్యంగా పిల్లలు, యువతలో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతోంది.
నివేదికలోని ముఖ్య అంశాలు..
మార్కెట్లో లభించే కొన్ని సాధారణ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉండే చక్కెర, కొవ్వు, , సోడియం వివరాలు ఇలా ఉన్నాయి..
డార్క్ ఫ్యాంటసీ చాకో ఫిల్స్ బిస్కెట్లు: WHO గైడ్‌లైన్స్ ప్రకారం 100 గ్రాములకు 6 గ్రాముల చక్కెర మాత్రమే ఉండాలి. కానీ, ఈ బిస్కెట్లలో 35.8 గ్రాముల చక్కెర, 27.2 గ్రాముల కొవ్వు ఉన్నాయి.

పతంజలి జూస్ బిస్కెట్లు: వీటిలో 24 గ్రాముల చక్కెర, 17 గ్రాముల కొవ్వు ఉన్నాయి.
క్యాడ్‌బరీ డార్క్ చాకోబేక్ కేక్: ఇందులో అత్యధికంగా 41.1 గ్రాముల చక్కెర , 21.9 గ్రాముల కొవ్వు ఉన్నాయి.
చాకో కిస్ ఓరియోస్: ఇందులో 38 గ్రాముల చక్కెర ఉంది.
ఆరియన్ డ్రై ఫ్రూట్ చంక్స్: ఇందులో 29 గ్రాముల చక్కెర ఉంది.
WHO గైడ్‌లైన్స్ ప్రకారం, 100 గ్రాముల ఆహారంలో గరిష్టంగా 6 గ్రాముల చక్కెర, 8 గ్రాముల కొవ్వు, 250 మిల్లీగ్రాముల సోడియం ఉండాలి. కానీ, ఈ పట్టికలో పేర్కొన్న దాదాపు అన్ని ఉత్పత్తులు ఈ పరిమితులను మించి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని ఉత్పత్తులలో సోడియం స్థాయి 938.3 మిల్లీగ్రాముల వరకు ఉంది.
ఇది కూడా చదవండి…రోజువారీ స్నాక్స్ తో ఆరోగ్యానికి మరింత ప్రమాదం..
ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉన్న అధిక చక్కెర, కొవ్వు, సోడియం, ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఈ పదార్థాలు రుచిగా ఉన్నప్పటికీ, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కింది సమస్యలు తలెత్తుతాయి. అవేంటంటే..?
బరువు పెరగడం,ఊబకాయం.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం రావడం.
అధిక రక్తపోటు,గుండె జబ్బుల ప్రమాదం పెరగడం.
పిల్లల్లో పోషకాహార లోపం.
ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను తగ్గించాలని వైద్య నిపుణులు,పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, నట్స్ ,ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఆహార ఉత్పత్తుల లేబుళ్లను జాగ్రత్తగా చదివి, చక్కెర, కొవ్వు, సోడియం తక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలని వారు సలహా ఇస్తున్నారు.