365తెలుగు డాట్ కామ్ డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 22,2023: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయా పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది.
వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి.
పాలేరు సీటు కోసం కాంగ్రెస్ సీపీఎం మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం మధ్య పాలేరు సీటు పంచాయితీ సాగుతోంది.
పాలేరు సీటు తమకే కావాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తుండగా పాలేరుకు బదులు వైరా స్థానం ఇస్తామని కాంగ్రెస్ నచ్చచెబుతోంది. పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతుంది.
సీటు వ్యవహారంపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించి చర్చిస్తున్నట్లు సమాచారం.
పొంగులేటి తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. దీంతో పొంగులేటికి పాలేరు తుమ్మలకు ఖమ్మం స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది.
ఈ నేపథ్యంలో పాలేరు స్థానాన్ని సీపీఎంకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థానంలో సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్నారు.
ఆ స్థానం ఇవ్వకుంటే పొత్తుకు సీపీఎం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విచిత్రమేంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కోరే సీట్లన్నీ కీలకమైనవే. గతంలో మధిర స్థానాన్ని కూడా సీపీఎం ప్రతిపాదించింది.
ఆ స్థానంలో భట్టి విక్రమార్క అనేక సార్లు విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాలను సీపీఎం కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది.
ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో లెఫ్ట్ సీట్ల వ్యవహారం ఉంది. పొత్తు అంశం త్వరగా కొలిక్కి రావాలని కామ్రేడ్లు వేచి చూస్తున్నారు.