365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్13, 2025 : పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 12, 2025న మంద నరసింహారెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రతిభను ప్రోత్సహించడం, విద్యా సంవత్సరంలో సాధించిన విజయాలను పంచుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పాఠశాల ఛైర్మన్ కొమరయ్య (ఎమ్మెల్సీ), యశస్వి (సీఈఓ),పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఘన స్వాగతం పలికారు. అతిథులు చేసిన దీప ప్రజ్వలనతో కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..
ఈ సందర్భంగా పాఠశాల గాయక బృందం ఆలపించిన పల్లవి పాఠశాల గీతం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, పిరమిడ్లు, నాటకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ముఖ్యంగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతీ వైభవాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు దేశ వైవిధ్యాన్ని, ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే మన సంస్కృతిని అద్భుతంగా చాటాయి.
అతిథి ఏడుకొండలు విద్యా, క్రీడలు, సృజనాత్మక రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు.
లక్ష్యసాధనలో పట్టుదల అవసరం..

ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్యసాయి ఘంటసాల (హనుమతోపాసకులు) మాట్లాడుతూ, విద్యార్థులు తమ లక్ష్యసాధనలో పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కిరణ్మయి ఈ సందర్భంగా పాఠశాల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
చివరగా, పాఠశాల ఉప ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జానకి కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులకు, విజయవంతం కావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.
