365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కనిగిరి,ఏప్రిల్ 3,2025: ప్రకాశం జిల్లా చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోయే రోజు ఇది అని దివాకరపల్లి సభలో ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించారు. సీబీజీ ప్లాంట్‌కు భూమిపూజ అనంతరం జరిగిన సభలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతోనే రిలయన్స్ తన తొలి సీబీజీ ప్లాంట్‌ను ప్రకాశం జిల్లాలో ప్రారంభించిందని చెప్పారు. పరిశ్రమల సాధనలో కృషిచేసిన మంత్రి నారా లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ విజయానంద్, రిలయన్స్ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
కూటమి ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోనే ఇది సాధ్యమైంది. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని, కానీ ఇప్పుడు పారిశ్రామిక వేత్తలు తిరిగి ఏపీ వైపు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కేవలం 10 నెలల్లోనే సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
Read this also…Andhra Pradesh Takes a Green Leap: Nara Lokesh Lays Foundation for Reliance CBG Plant in Prakasam
పెన్షన్ రూ. 4 వేలకు పెంపు
“సూపర్ సిక్స్” హామీలను నెరవేర్చుతున్నామని మంత్రి గుర్తుచేశారు. రూ. 200 పెన్షన్‌ను రూ. 2,000కి పెంచామని, జగన్ రెడ్డికి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి తక్కువ సమయంలోనే పెన్షన్‌ను రూ. 4,000కు పెంచిందని వివరించారు. డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో వెలువడనుందని, ఎస్సీ వర్గీకరణ పూర్తిచేసి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం సంకల్పబద్ధత
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పెన్షన్లను అందిస్తున్నామని తెలిపారు. ఏటా రూ. 30 వేల కోట్లు కేవలం పెన్షన్లకే వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించామని, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ మే నెలలో అమలు చేయనున్నామని వివరించారు.
కనిగిరికి లోకేష్ వరం
కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ మా ప్రాంతానికి సీబీజీ ప్లాంట్ తీసుకురావాలంటూ మేము అడగకుండానే లోకేష్ గారు వరంగా ఇచ్చారని పేర్కొన్నారు. లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రలో ప్రజల ఆదరణను గుర్తుచేసుకుంటూ, కనిగిరిలో పరిశ్రమ స్థాపనకు తోడ్పడినందుకు మంత్రి నారా లోకేష్‌కు, రిలయన్స్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read this also…Reliance Launches First CBG Plant in Andhra Pradesh, Plans Rs.65,000 Crore Investment for 500 Green Energy Hubs
రిలయన్స్ భారీ పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 500 సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గుజరాత్ తర్వాత ఏపీలోనే రిలయన్స్ లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు.

గ్రామీణ అభివృద్ధికి ఊతం
రిలయన్స్ బయోఎనర్జీ సీఈవో హరీంద్ర త్రిపాఠి మాట్లాడుతూ బయోఫ్యూయల్ ఎకానమీలో ఇది మైలురాయి అని అభివర్ణించారు. గత 10 ఏళ్లలో బయోఫ్యూయల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం రూ. 25 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు. ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉండటంతో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
మారుమూల ప్రాంతమైన కనిగిరికి పరిశ్రమలు రావడం అభివృద్ధికి నిదర్శనం అని ప్రముఖులు పేర్కొన్నారు. రిలయన్స్ సీబీజీ ప్లాంట్ ప్రారంభంతో జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి నూతన దారులు తెరచుకున్నాయి.