
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,సెప్టెంబర్, తిరుపతి 23,2021: :టిటిడికి అనుబంధంగా ఉన్న కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో అక్టోబరు 2 నుంచి 4వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబరు 1న సాయంత్రం ఆచార్యవరణం, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే కైంకర్యాల్లో తెలియక జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబరు రెండో తేదీన ఉదయం అకల్మష హోమం, రక్షాబంధనం సాయంత్రం పవిత్రప్రతిష్ఠ, హెమం నిర్వహిస్తారు. అక్టోబరు 3న రెండో రోజు స్నపనతిరుమంజనం,హోమం, పవిత్ర సమర్పణ, సాయంత్రం హోమం చేపడతారు.అక్టోబరు 4న చివరి రోజు ఉదయం హోమం, సాయంత్రం మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి.