365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబర్ 6,2021: అంబేద్కర్ చూపిన మార్గంలోనే జనసేన ప్రస్థానం కొనసాగుతుందని, బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ కారణజన్ముడు, భారత రాజ్యంగ శిల్పిగా పూజలు అందుకుంటున్న మహనీయులు ఈరోజు ఆ మహానుభావుడు పరమపదం చెందిన పుణ్యతిధి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆ దీనజనోద్ధారునికి భక్తిపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను.
“నేను ఆరాధించే గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయం. ఆయనపట్ల నాకున్న భక్తి భావనే లండన్ లో ఆయన నివసించిన గృహాన్ని, లక్నోలో ఆయన స్మారక మందిరాన్ని సందర్శించేలా చేసింది. దేశంలో నిరంతరాయంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ ఆద్యులుగా చెప్పుకోవడం మనకు గర్వకారణం. రాజ్యాంగంలో నాడు ఆయన కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తుంటాయి. నేటి తరం రాజకీయ నాయకుల వికృత వైపరీత్యాలను ముందే పసిగట్టి ప్రజలకు ఇటువంటి రక్షా బంధనం రూపొందించారేమోనని ప్రస్తుత పరిస్థితులలో అనిపించకమానదని” పవన్ పేర్కొన్నారు.
భారతదేశంలో పుట్టిన ఒక గొప్ప మేధావిగా, మానవతా విలువలు మూర్తీభవించిన మహా మనిషిగా ప్రపంచం కొనియాడిన అంబేద్కర్ చూపిన మార్గంలోనే జనసేన ప్రస్థానం కొనసాగుతుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తూ… ఆ తేజోమూర్తికి ప్రణామాలు అర్పిస్తున్నాను’అని పవన్ కల్యాణ అన్నారు.