365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 24,2025 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగించే మరో అప్‌డేట్ వచ్చేసింది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘OG’ నుండి రెండవ సింగిల్ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నారు.

‘సువ్వి సువ్వి’ పాట విడుదల తేదీ..

చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ‘సువ్వి సువ్వి’ అనే రెండవ పాట ఆగస్టు 27న ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ సంప్రదాయ దుస్తుల్లో, కలశాలను చేతపట్టుకుని పూజ చేస్తున్న దృశ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట ఏ థీమ్‌లో ఉంటుందోనని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చించు కుంటున్నారు.

‘OG’ విడుదల తేదీ..

డి.వి.వి. దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

‘OG’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. “They Call Him OG” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం అభిమానుల ముందుకు రానుంది. ఈ సినిమా పవన్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.