365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల, జూన్ 11,2022: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు పరమపద వైకుంఠ నాథుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు.
శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయడిప్యూటీ ఈవో లోకనాథం, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణభట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.