365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 12,2026 : ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాల తయారీలో కొన్ని ఫార్మా కంపెనీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. కఠినమైన ఔషధ నియమ నిబంధనల (Drug Rules) నుంచి తప్పించుకోవడానికి, అసలైన మందులను ‘న్యూట్రాస్యూటికల్స్’ లేదా ‘ఆహార పదార్థాల’ (Food Products) పేరుతో విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నాయి. గత ఆరు నెలల్లో తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (DCA) జరిపిన సోదాల్లో ఇలాంటి కనీసం తొమ్మిది అక్రమ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.
డ్రగ్ లైసెన్స్..

సాధారణంగా ఒక ఔషధాన్ని తయారు చేయాలంటే డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలి, కచ్చితమైన నాణ్యత పరీక్షలు (Quality Testing) నిర్వహించాలి. అయితే, వీటిని ఫుడ్ లైసెన్స్ కింద నమోదు చేయడం వల్ల నిబంధనలు సడలుతాయి, ఖర్చు తగ్గుతుంది, అనుమతులు త్వరగా వస్తాయి. ఈ లొసుగులను ఆసరాగా చేసుకుని కంపెనీలు ముఖ్యంగా ఐరన్, జింక్ ఆధారిత మందులను ఆహార ఉత్పత్తులుగా చలామణి చేస్తున్నాయి.
కాల్షియం-D3 ట్యాబ్లెట్లు, ఫోరాన్-XT, రిబోవిన్, ప్రోకాల్క్-జడ్ వంటి ఉత్పత్తులను తప్పుడు ముద్రలతో విక్రయిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు.డ్రగ్ నియంత్రణ లేని ఇలాంటి ఉత్పత్తుల్లో డోసేజీ తప్పుగా ఉండటం, కలుషితాలు చేరడం వల్ల రోగులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
