365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, ఆగస్టు 24,2025 : స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో మరో అద్భుతమైన ఆవిష్కరణకు గూగుల్ తెరతీసింది. మొబైల్ నెట్‌వర్క్ లేదా వై-ఫై లేని ప్రాంతాల్లో కూడా వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను గూగుల్ ప్రకటించింది.

ఈ ఫీచర్ కొత్తగా విడుదలైన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్‌లలో అందుబాటులోకి రానుంది. దీని వల్ల మారుమూల ప్రాంతాల్లో ఉండే వినియోగదారులకు కమ్యూనికేషన్ సులభతరం కానుంది.

ఆగస్టు 28 నుంచి అందుబాటులోకి..

గత ఆగస్టు 20న జరిగిన ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో గూగుల్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 10 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ విడుదలైన కొన్ని రోజులకే, కంపెనీ ఈ సంచలనాత్మక ఫీచర్‌ను ప్రకటించింది.

ఆగస్టు 28 నుంచి పిక్సెల్ 10 సిరీస్ ఫోన్‌లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని గూగుల్ వెల్లడించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా వాట్సాప్ ఉపగ్రహ ఆధారిత కాలింగ్‌కు మద్దతు ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌లు పిక్సెల్ 10 సిరీస్ కానున్నాయి.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

ఈ కొత్త ఫీచర్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తుంది. దీనికి సంబంధించి గూగుల్ ఒక టీజర్ వీడియోను కూడా తమ అధికారిక ‘X’ (గతంలో ట్విట్టర్) అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

మీ ఫోన్‌కు మొబైల్ నెట్‌వర్క్ లేదా వై-ఫై లేనప్పుడు, శాటిలైట్ నెట్‌వర్క్ ఆటోమేటిక్‌గా ఆక్టివేట్ అవుతుంది.

మీరు వాట్సాప్ కాల్ చేసినప్పుడు లేదా అందుకున్నప్పుడు, మీ ఫోన్ స్క్రీన్ పైభాగంలో శాటిలైట్ ఐకాన్ కనిపిస్తుంది.

సాధారణంగా కాల్ చేసినట్లే మీరు వాయిస్ లేదా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అయితే, ఈ కాల్స్ మొబైల్ నెట్‌వర్క్‌కు బదులుగా నేరుగా ఉపగ్రహం ద్వారా కనెక్ట్ అవుతాయి.

నిబంధనలు, షరతులు వర్తిస్తాయి..

ఈ ఫీచర్‌కు కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయని గూగుల్ స్పష్టం చేసింది.

ఈ ఫీచర్ కొన్ని క్యారియర్‌లతో మాత్రమే పనిచేస్తుంది.

ఈ సేవను ఉపయోగించినందుకు వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు.

ఉపగ్రహ ఆధారిత ఫీచర్లు..

ఈ సరికొత్త కాలింగ్ ఫీచర్, గూగుల్ మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో ప్రకటించిన ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అప్‌డేట్‌లో భాగం. దీని ద్వారా పిక్సెల్ 10 సిరీస్ వినియోగదారులు ‘ఫైండ్ హబ్’ లేదా ‘గూగుల్ మ్యాప్స్’ ద్వారా కూడా ఉపగ్రహం సహాయంతో తమ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్ ‘స్కైలో’ అనే నాన్-టెరెస్ట్రియల్ ప్రొవైడర్ కంపెనీతో గూగుల్ భాగస్వామ్యం ద్వారా అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతానికి శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా వాట్సాప్‌లో టెక్స్ట్ మెసేజ్‌లు కూడా పంపుకోవచ్చా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, భవిష్యత్తులో మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో మెసేజ్ సేవలు కూడా పనిచేస్తాయని స్పష్టమవుతోంది.