365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 2,2025 : వ్యవసాయ రంగంలో వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న15 వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) గుర్తింపు పత్రాలు జారీ చేసింది.
పీజేటీఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య ఈరోజు అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్లో ఈ సంస్థలకు ధృవపత్రాలు అందజేశారు. ఈ సంస్థలు పీజేటీఏయూ అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్లో సాంకేతిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి.
ఆకుకూరల సాగులో రోబోల తోడ్పాటు..
మానవ రహిత వ్యవసాయ లక్ష్య సాధనలో ఇదొక తొలి అడుగుగా భావిస్తున్నామని ప్రొఫెసర్ జానయ్య అన్నారు. ఈ సందర్భంగా కూరగాయల సాగులో మానవ ప్రమేయాన్ని తగ్గించి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన రోబోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
అంకుర సంస్థలకు భారీగా ఆర్థిక సాయం
అగ్రి హబ్ తరఫున ఇప్పటివరకు దాదాపు 150 అంకుర సంస్థలకు నాబార్డ్ సహాయంతో చేయూతనందించామని జానయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ యువత, అభ్యుదయ రైతులకు ప్రోత్సాహంలో భాగంగా నాబార్డ్ ఆర్థిక సహకారాన్ని ఆరుగురికి అందజేశారు.
అంతేకాకుండా, మరో రెండు అంకుర సంస్థలకు ఒక్కొక్క దానికి రూ. 40 లక్షల చొప్పున మొత్తం రూ. 80 లక్షల ఆర్థిక సాయం పీజేటీఏయూ అగ్రి హబ్ ద్వారా అందించారు.
వికసిత్ భారత్ సాధనలో వ్యవసాయం కీలకపాత్ర..

2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్గా మార్చాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంలో వ్యవసాయానిది కీలకపాత్ర అని ప్రొఫెసర్ జానయ్య స్పష్టం చేశారు.
దేశ సంపద మూలాలు ఇప్పటికీ గ్రామీణ భారతంలో, వ్యవసాయ రంగంలోనే కేంద్రీకృతమై ఉన్నందున, ఈ రంగాలకి పెద్దపీట వేసి వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీజీఎం దీప్తి, వీ హబ్ ప్రతినిధి సీత, పీజేటీఏయూ రిజిస్ట్రార్ డాక్టర్ జీ.ఈ.సీహెచ్ విద్యాసాగర్, ఏజీ హబ్ ఎండీ జీ. వెంకటేశ్వర్లు, వివిధ అంకుర సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.