365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 14,2025: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) మరో విశిష్ట విద్యా చరిత్రకు నాంది పలికింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి పీజేటీఏయూ, ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక వెస్టర్న్ సిడ్ని విశ్వవిద్యాలయం (WSU)లతో కలసి నాలుగేళ్ల B.Sc వ్యవసాయ డిగ్రీ కోర్సును ప్రారంభించనుంది.

ఈ కొత్త కోర్సులో విద్యార్థులు మొదటి మూడేళ్లు పీజేటీఏయూలో, నాలుగో సంవత్సరం WSUలో చదివే అవకాశాన్ని పొందనున్నారు. దీనివల్ల విద్యార్థులు రెండు విశ్వవిద్యాలయాల్లో చదివే అనుభవాన్ని పొందుతారు.

అనంతరం విద్యార్థులు M.Sc చదవాలనుకుంటే, అదనంగా మరో సంవత్సరం WSUలో చదివి అక్కడి నుంచి డిగ్రీ పొందవచ్చు. ఇక పీజీ తర్వాత పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఆధారంగా పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది.

ఈ అంశంపై రెండు విశ్వవిద్యాలయాల మధ్య ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని పీజేటీఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య తెలిపారు.

వెస్టర్న్ సిడ్ని విశ్వవిద్యాలయం అందించే వ్యవసాయ కోర్సులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) గుర్తింపు ఉందని, గత ఏడాది WSU-ICAR మధ్య ప్రత్యేక ఒప్పందం కూడా కుదిరిందని ఆయన పేర్కొన్నారు.

EAPCET విజేతలకు అభినందనలు – జానయ్య

ఈ రోజు విడుదలైన EAPCET-2025 ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రొఫెసర్ జానయ్య శుభాకాంక్షలు తెలిపారు. ప్రవేశాలకు సంబంధించి రెగ్యులర్,ప్రత్యేక కోటా సీట్లు పెంచినట్లు, ఫీజులల్లో సైతం తగ్గింపు కల్పించినట్లు తెలిపారు.

అదనంగా, కొత్త కళాశాలల స్థాపనకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం మరియు NRI కోటా ప్రవేశాల కోసం ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రకటించారు.

తల్లిదండ్రులకు, విద్యార్థులకు జాగ్రత్తలు

రాష్ట్రంలో ICAR గుర్తింపు లేకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు B.Sc వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయని, అవి అనధికారికమైనవని జానయ్య హెచ్చరించారు. రాష్ట్రంలో B.Sc (అగ్రికల్చర్) కోర్సు అందించేందుకు ICAR గుర్తింపు కలిగిన ఏకైక సంస్థ పీజేటీఏయూనే అని స్పష్టం చేశారు. విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ప్రైవేట్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.