365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 4,2025 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) 55వ స్నాతకోత్సవాన్ని జూలై 31వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch. విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ స్నాతకోత్సవంలో భాగంగా 01-11-2021 నుండి 31-10-2022 మధ్య కాలంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. మొత్తం 153 మంది పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులతో పాటు, 691 మంది యూజీ విద్యార్థులకు పట్టాలు అందించబడతాయి.

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ కార్యక్రమంలో స్వర్ణ పతకాలు అందజేయనున్నారు. 33 మంది అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు, 14 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారని రిజిస్ట్రార్ వివరించారు.

ఈ స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అవసరమైన సూచనలు, అడ్మిట్ కార్డులు, అలాగే డ్రెస్ కోడ్ వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.pjtau.edu.in లో జూలై 20, 2025 నుంచి అందుబాటులో ఉంటాయని డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు.