365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 27,2022: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ పుష్పగుచ్చం అందించి ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ప్రధానాలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ముర్ము కు అర్చకులు, వేదపండితులు మంగళవాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
రత్నగర్భగణపతిస్వామి వారిని, శ్రీ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం, శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లకు కుంకుమార్చన జరిపించారు.
అనంతరం భారత రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్లను అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శేషవస్త్రాలను, లడ్డు,ప్రసాదాలను శ్రీస్వామి,అమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు.
అనంతరం రాష్ట్రపతికి డిప్యూటీ సీఎం కొట్ట సత్యనారాయణ దేవాలయ విశిష్టతలను గురించి ఆమెకు వివరించారు.
అనంతరం నంది సర్కిల్ సమీపంలోని టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్‌లో (యాత్రికుల సదుపాయ కేంద్రం) రూ. 47.23 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం క్రింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
శ్రీశైలం దేవాలయం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 120 కోట్లతో క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి, మొదటి విడత కింద 50 కోట్లు నిధులు మంజూరు చేయవలసిందిగా కేంద్రం టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డికి రికమండ్ చేయవలసిందిగా రాష్ట్రపతి ముర్ముకు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వినతి పత్రం అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం “ప్రసాద్ పథకం” ద్వారా ఈ నిధులు విడుదల చేయాల్సిందిగా మంత్రి రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు.
అలాగే పక్కనే ఉన్న కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా వినతి పత్రం అందించగా ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.