Tue. Dec 17th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, నేషనల్, డిసెంబర్ 26, 2021: ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ 2021 డిసెంబర్ 27న హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన దాదాపు రూ.11,000 కోట్ల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతోపాటు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి ముందు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ అంతర్జాతీయ పెట్టబడిదారుల రెండో సదస్సు ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.

   దేశంలో అందుబాటులోగల వనరుల సద్వినియోగం ద్వారా వాటి పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవడంపై ప్రధానమంత్రి సదా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా హిమాలయ ప్రాంతంలో జలవిద్యుత్ సామర్థ్యాన్ని గరిష్ఠంగా వాడుకోవాలన్నది ఒక సంకల్పం. ఈ దిశగా ప్రధాని ప్రారంభించే, శంకుస్థాపన చేయబోయే ప్రాజెక్టులు ఒక కీలక దశను ప్రతిబింబిస్తాయి. వీటిలో రేణుకాజీ డ్యామ్‌ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది మూడు దశాబ్దాల నుంచీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో సహకార సమాఖ్యపై ప్రధాని దార్శనికతకు అనుగుణంగా 6 రాష్ట్రాలు… హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం వాటిని ఏకతాటిపైకి తెచ్చినందువల్ల రూ.7,000 కోట్లతో 40 మెగావాట్ల సామర్థ్యంగల ఈ ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీనివల్ల ముఖ్యంగా ఢిల్లీకి విస్తృత ప్రయోజనం కలుగుతుంది. ఈ మేరకు ప్రస్తుత నీటి సరఫరాకు ఏటా సుమారు 500 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల అదనపు సామర్థ్యం జోడించబడుతుంది.

   ప్రధానమంత్రి 210 మెగావాట్ల లుహ్రీ స్టేజ్-1 జలవిద్యుత్‌ ప్రాజెక్టుకూ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టును రూ.1800 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించనుండగా ఇది ఏటా 750 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీనికి ప్రస్తుత ఆధునిక, ఆధారపడదగిన గ్రిడ్ మద్దతు వల్ల ఈ ప్రాంతంతోపాటు పరిసర రాష్ట్రాలకూ ప్రయోజనం లభిస్తుంది. అలాగే 66 మెగావాట్ల ధౌలాసిధ్ జలవిద్యుత్‌ ప్రాజెక్టుకూ ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇది హమీర్‌పూర్ జిల్లాలో తొలి ప్రాజెక్ట్ కాగా, దీన్ని రూ.680 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించనున్నారు. దీనిద్వారా ఏటా  300 మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్తు ఉత్పత్తి కాగలదు. వీటితోపాటు రూ.2,080 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన 111 మెగావాట్ల  ‘సావ్రా-కుద్దూ’ జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు. ఇందులో ఏటా 380 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. తద్వారా రాష్ట్రానికి ఏటా రూ.120 కోట్ల దాకా ఆదాయార్జనకు వీలుంటుంది.

   ఈ కార్యక్రమాలన్నిటికన్నా ముందు హిమాచల్ ప్రదేశ్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల రెండో సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా దాదాపు రూ.28,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో పెట్టుబడులకు ఈ సదస్సు ఊపునిస్తుందని భావిస్తున్నారు.

error: Content is protected !!