Sat. Nov 9th, 2024
News18 Telugu - Ayodhya: అయోధ్య రామాలయం కోసం 28 ఏళ్లుగా రోజూ రూ.5 పక్కన  పెట్టిన మహిళ | Ayodhya Ram temple 80 year old woman from Uttar pradesh  donated money which set aside rupees 5

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ జూన్ 26, 2021:అయోధ్య ప్రగతి ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు అయోధ్య నగరం అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాధికారులు ఒక ప్రదర్శనద్వారా ఆయనకు నివేదించారు. అయోధ్యను ఆధ్యాత్మిక కేంద్రంగా, అంతర్జాతీయ పర్యాటక కూడలిగా, సుస్థిర అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా అయోధ్యతో అనుసంధాన పెంచేదిశగా రూపుదిద్దుకోనున్న,  ప్రతిపాదిత పథకాల గురించి వారు ప్రధానికి వివరించారు. ఇందులో భాగంగా విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ విస్తరణ, బస్సు స్టేషన్‌, రోడ్లు, రహదారులు తదితర పథకాల గురించి చర్చించారు. దీంతోపాటు అయోధ్యకు అనుబంధంగా హరితక్షేత్ర శివారు పట్టణాభివృద్ధిపైనా అధికారులు చర్చించారు. నగరాన్ని సందర్శించే భక్తులకు వసతిసహా ఆశ్రమాలు, మఠాలు, హోటళ్లు, వివిధ రాష్ట్రాల భవనాలకు స్థలం కేటాయించబడుతుంది. ఇవేకాకుండా పర్యాటకుల కోసం సహాయ-వసతి కేంద్రం, ప్రపంచ స్థాయి ప్రదర్శనశాల నిర్మాణం కూడా చేపడతారు.సరయూ నది, దాని ఘాట్ల చుట్టూ మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతోపాటు సరయూ నదిలో నిరంతర నౌకా విహార సదుపాయం ఏర్పాటుకు సంకల్పించారు. మరోవైపు సైకిళ్లపై వెళ్లేవారికి, పాదచారులకు తగినంత స్థలం కేటాయిస్తూ నగరాన్ని సుస్థిర స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. అలాగే అత్యాధునిక నగర స్థాయి మౌలిక సదుపాయాలతో వాహనాల రాకపోకలను ఆధునిక పద్థతిలో నిర్వహించనున్నారు. అయోధ్య నగరం ప్రతి భారతీయుడి సాంస్కృతిక చైతన్యంలో ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఆ మేరకు అయోధ్య మన అత్యుత్తమ సంప్రదాయాలను, ప్రగతిశీల పరివర్తనాత్మకతను దశదిశలా చాటాలని ఆయన ఆకాంక్షించారు.

   అయోధ్య ఆధ్యాత్మికతతో నిండినదేగాక లోకోత్తర నగరమని, మానవ నైతిక నిరతిని ఇక్కడి  ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రతిబింబించాలని ప్రధానమంత్రి అభిలషించారు. తద్వారా పర్యాటకులు, భక్తజనంసహా అందరికీ ప్రయోజనకరంగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు. ఆ మేరకు జీవితంలో కనీసం ఒక్కసారి అయోధ్య సందర్శించాలని రాబోయే తరాలవారు ఉవ్విళ్లూరేలా ఉండాలని ప్రధానమంత్రి నిర్దేశించారు. అయోధ్యలో అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో అయోధ్యను తదుపరి పురోగమన దశకు తీసుకెళ్లేందుకు ఇప్పట్నుంచే వేగం పుంజుకోవడం తప్పనిసరని స్పష్టం చేశారు. అయోధ్యకుగల గుర్తింపును ఘనంగా ముందుకు తీసుకెళ్లడానికి, దాని సాంస్కృతిక ఉత్తేజాన్ని వినూత్న మార్గాల్లో సజీవంగా ఉంచడానికి మనమంతా  సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.మహాపురుషుడైన శ్రీరాముడు జనావళిని ఏకతాటిపైకి తేగల సమర్థుడని, తదనుగుణంగా ప్రజల.. ముఖ్యంగా యువత ఆరోగ్యకర భాగస్వామ్య స్ఫూర్తి అయోధ్య అభివృద్ధి పనులకు మార్గదర్శకం కావాలని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నగరాభివృద్ధిలో ప్రతిభావంతులైన యువతరం శక్తిసామర్థ్యాలను సముచితంగా వినియోగించుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఉప ముఖ్యమంత్రులు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేష్‌ శర్మసహా పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

error: Content is protected !!