365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 11,2023: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్,హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్‌యూఎల్ వంటి కంపెనీల మద్దతుతో మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండో సెషన్లోనూ ఎగిశాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధ ప్రభావం ఆ ప్రాంతానికే పరిమితం కావడం, ముడి చమురు ధరలపై ప్రభావం లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.

రాబోయే నెలల్లో సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఆసియాలో హాంకాంగ్, కొరియా, జపాన్, చైనా సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121, బీఎస్‌ఈ సెన్సెక్స్ 393 పాయింట్ల మేర పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే 6 పైసలు బలపడి 83.19 వద్ద స్థిరపడింది.
క్రితం సెషన్లో 66,079 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,376 వద్ద మొదలైంది. 66,299 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,592 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.
చివరికి 393 పాయింట్లు పెరిగి 66,473 వద్ద ముగిసింది. మంగళవారం 19,689 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,767 వద్ద ఓపెనైంది. 19,756 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది.
19,839 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 121 పాయింట్లు పెరిగి 19,811 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 156 పాయింట్లు ఎగిసి 44,516 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50 అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 37:12గా ఉంది. హీరో మోటో (4.04%), గ్రాసిమ్ (3.31%), విప్రో (3.27%), అల్ట్రాటెక్ సెమ్ (2.10%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.62%) టాప్ గెయినర్స్. హెచ్‌సీఎల్ టెక్ (1.65%), కోల్ ఇండియా (0.64%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (0.58%), ఎస్బీఐ (0.46%), టీసీఎస్ (0.44%) టాప్ లాసర్స్.
రంగాల వారీగా చూస్తే ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు స్వల్పంగా తగ్గాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి.
అక్టోబర్ నెల నిఫ్టీ ఫ్యూచర్స్ టెక్నికల్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,900 వద్ద రెసిస్టెన్స్, 19,780 వద్ద సపోర్ట్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి హిందుస్థాన్ యునీలివర్, హీరోమోటో, కేపీఐటీ, వెల్‌స్పన్, టొరెంట్ పవర్ షేర్లను కొనుగోలు చేయొచ్చు.
నిఫ్టీ పెరగడంలో రిలయన్స్ 28, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 25, యూపీఎల్ 8, ఐటీసీ 6, కొటక్ బ్యాంకు 5 పాయింట్ల మేర కంట్రిబ్యూట్ చేశాయి.
నేడు ఇన్ఫోసిస్‌లో ఓ పెద్ద ట్రేడ్ జరిగింది. 14.4 లక్షల షేర్లు చేతుల మారాయి. అమ్మింది, కొనుగోలు చేసిందెవరో ఇంకా తెలియలేదు. ఇక ఐసీఐసీఐ బ్యాంకులోనూ 22.3 లక్షల షేర్లు మారాయి.

భారతీ ఎయిర్‌టెల్‌లో 13.3 లక్షలు, యాక్సిస్ బ్యాంకులో 10.1 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎయిర్‌టెల్, చోలమండలం ఇన్వెస్ట్‌మెంట్స్, కోల్ ఇండియా, డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, కేపీఐటీ టెక్నాలజీ, పేటీఎం షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.
సాతియా ఇండస్ట్రీస్‌కు రూ.340 కోట్ల విలువైన కాగితం సరఫరా ఆర్డర్ వచ్చింది. గ్యాస్ కంప్రెషన్ ప్లాంట్ల కోసం మిడిల్ ఈస్ట్‌లో ఎల్‌టీ హైడ్రోకార్బన్ బిజినెస్‌కు ఓ భారీ ప్రాజెక్టు దక్కింది. క్యూఐపీ పద్ధతిలో రూ.259 కోట్లు సమీకరించడంతో లక్ష్మీ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర 12 శాతం పెరిగింది.

- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709